Rajinikanth: అతని వల్లే జైలర్‌‌ సూపర్‌‌ హిట్ అయింది: రజనీకాంత్

  • అనిరుధ్ సంగీతం అద్భుతంగా ఉందన్న సూపర్ స్టార్
  •  నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడని కితాబు
  • రూ. 600 కోట్లు వసూలు చేసిన జైలర్
Anirudh was the man behind Jailer huge success says Rajinikanth

వరుస పరాజయాల్లో ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్ 'జైలర్' చిత్రంతో మళ్లీ విజయాల బాట పట్టారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ హిట్ కావడంతో పాటు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. రజనీకాంత్ కెరీర్‌‌లో రికార్డు స్థాయిలో సుమారు రూ.600 కోట్లకి పైగా వసూలు చేసింది. కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో హీరో సహా పలువురికి నిర్మాత ఖరీదైన కార్లు బహుమతిగా ఇచ్చారు. ఈ సినిమా విజయోత్సవానికి తాను ఆ కారులోనే వస్తానని రజనీకాంత్ తెలిపారు. ఈ సినిమా కోసం పని చేసిన వాళ్లందరికీ నిర్మాత గోల్డ్ కాయిన్స్ ఇచ్చారని,  ఇది చాలా మంచి పద్ధతి అని కొనియాడారు. 

ఈ విషయం ఒక్క తమిళ సినిమాలకే కాకుండా భారతదేశ చిత్ర పరిశ్రమకే గర్వకారణం అవుతుందన్నారు. ఇక, జైలర్ సినిమా ఎబోవ్ యావరేజ్ అవుతుందని తాను అనుకున్నానని రజనీ చెప్పారు. కానీ అనిరుధ్ రవిచందర్ అందించిన నేపధ్య సంగీతంతో ఇలా పెద్ద హిట్ అయిందన్నారు. రవిచందర్ తన సంగీతంతో ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాడని, తన స్నేహితుడు, దర్శకుడు నెల్సన్ కి హిట్ ఇవ్వాలని నేపధ్య సంగీతం బాగా అందించాడని అభిప్రాయపడ్డారు. ఇక,  ఈ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ పాత్రలను దర్శకుడు చూపించిన తీరు చాలా బాగుందని కూడా ప్రశంసించారు. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యాక, తన తర్వాతి సినిమా ఇంతకన్నా పెద్దగా ఎలా ఇవ్వాలనే టెన్షన్ మొదలైందని రజనీకాంత్ చెప్పారు.

More Telugu News