Kerala: అదుపులోకి వచ్చిన నీపా వైరస్.. కేరళలో ఆంక్షల సడలింపు

  • కోజీకోడ్ జిల్లాలోని తొమ్మిది పంచాయతీల్లో ఆంక్షల సడలింపు
  • షాపులు రాత్రి 8 వరకూ, బ్యాంకులు మధ్యాహ్నం 2 వరకూ తెరిచి ఉంచేందుకు అనుమతి
  • రోగులకు సన్నిహితంగా వెళ్లి కాంటాక్ట్ లిస్టులో చేరిన వారికి మునుపటి నిబంధనల వర్తింపు
  • రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తాజా ప్రకటన 
Nipah virus under control in Kerala restrictions eased in containment zones

నీపా వైరస్‌ అదుపులోకి వచ్చిన నేపథ్యంలో కేరళ విపత్తు నిర్వహణ విభాగం ఆంక్షలు సడలింపునకు తెరతీసింది. కోజీకోడ్ జిల్లాలోని తొమ్మిది పంచాయతీల్లో కంటెయిన్మెంట్ జోన్ల ఆంక్షలు సడలిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. 

రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తాజాగా మార్గదర్శకాల ప్రకారం, ఇకపై కంటెయిన్మెంట్ జోన్లలోని షాపులను రాత్రి 8 గంటల వరకూ తెరిచి ఉంచవచ్చు. మధ్యాహ్నం రెండు వరకూ బ్యాంకు కార్యకలాపాల నిర్వహణకు అనుమతించింది. అయితే, మాస్కులు ధరించడం, శానిటైజర్ల వినియోగం, భౌతిక దూరం పాటించడం మాత్రం యథావిధిగా కొనసాగించాలి. ప్రజలు గుమికూడటంపై మునుపటి నిబంధనలే అమల్లో ఉంటాయి. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేవరకూ ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. 

నిపా వైరస్ రోగులతో సన్నిహితంగా మసలడంతో కాంటాక్ట్ లిస్టులో చేరిన వారు మాత్రం కఠిన నిబంధనలు పాటిస్తూ క్వారంటైన్‌లో కొనసాగాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 

సెప్టెంబర్ 16 తరువాత కేరళలో కొత్త నీపా కేసులేవీ నమోదు కాలేదు. ఇప్పటివరకూ కాంటాక్ట్ లిస్టు జాబితాలోని 218 మంది శాంపిళ్లను పరీక్షించగా అన్నీ టెస్టుల్లోనూ నిపా లేనట్టు రిజల్ట్ వచ్చిందని కేరళ ప్రభుత్వం సోమవారం పేర్కొంది. ప్రస్తుతం కోజీకోడ్ జిల్లాలోని 53 వార్డులు, పంచాయతీల్లో ఆంక్షలను సడలించారు.

More Telugu News