Bihar Police: లంచం పంపకాలపై గొడవ.. నడిరోడ్డు మీద కొట్టుకున్న బీహార్ పోలీసులు.. వీడియో ఇదిగో!

  • హైవేపై వాహనం ఆపి మరీ గొడవపడ్డ పోలీసులు
  • చుట్టూ గుమిగూడిన వాహనదారులు
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
  • క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్న ఉన్నతాధికారులు
Bihar Police personnel settling accounts among themselves viral video

జనాల దగ్గరి నుంచి వసూలు చేసిన లంచం పంపకాల విషయంలో ఇద్దరు పోలీసుల మధ్య వివాదం రేగింది. బీహార్ లోని నలంద జిల్లాలో చోటుచేసుకుందీ ఘటన. మాటామాటా పెరగడంతో హైవే పైన తమ వాహనాన్ని ఆపి ఇద్దరూ కిందకు దిగారు. ఆపై రోడ్డుపైనే ఒకరినొకరు కొట్టుకున్నారు. చొక్కాలు పట్టుకుని మరీ పోలీసులు కొట్టుకుంటుండంతో హైవే పైన వెళుతున్న వాహనదారులు కూడా ఆగి చోద్యం చూశారు. చుట్టూ గుమికూడిన వాళ్లు వారిస్తున్నా పోలీసులు వినిపించుకోలేదు.

ఒకరేమో వాహనంలోని లాఠీని తీసుకొచ్చి కొట్టేందుకు ప్రయత్నించగా మరో పోలీసు ఆ పక్కనే ఉన్న చెట్టు కొమ్మను విరిచి దాడికి ప్రయత్నించాడు. ఇదంతా అక్కడున్న వారు తమ మొబైల్స్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో అదికాస్తా వైరల్ గా మారింది. పోలీసుల ప్రవర్తనపై నెటిజన్లు మండిపడుతూ కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా విషయం బయటకు రావడంతో బీహార్ పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. రోడ్డు మీద కొట్టుకున్న ఆ పోలీసులు ఇద్దరిపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇప్పటికే వారిద్దరినీ పోలస్ సెంటర్ కు పిలిపించామని, విచారణ జరిపి ఇద్దరిపైనా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అయితే, ఆ పోలీసులు ఇద్దరినీ వెంటనే సస్పెండ్ చేయాలని కొంతమంది నెటిజన్లు డిమాండ్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం వారిద్దరినీ శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించాలని అంటున్నారు. మరో యూజర్ మాత్రం బీహార్ పోలీసులకు ఇలాంటి వారి వల్లే చెడ్డపేరు వస్తోందని విమర్శించాడు. కోపాన్ని నియంత్రించుకునేలా పోలీసులకు శిక్షణ ఇస్తే బాగుంటుందని సూచించాడు.

More Telugu News