Chandrababu: చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ ఆరో రోజు నిరాహార దీక్షలు... దీక్షా శిబిరాల్లో గణేశ పూజలు... ఫొటోలు ఇవిగో!

  • చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని ఆక్రోశిస్తున్న టీడీపీ నేతలు
  • ఇవాళ వినాయకచవితి
  • దీక్షా శిబిరాల్లో గణేశుడి విగ్రహాల ప్రతిష్టాపన
Protests continues after Chandrababu arrest

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు ఆరో రోజు రిలే నిరహార దీక్షలను చేపట్టారు. నేడు వినాయకచవితిని పురస్కరించుకుని దీక్షా శిబిరాలలో వినాయకుని విగ్రహాలను ప్రతిష్టాపించి పూజలు నిర్వహించారు. వైసీపీ అడ్డంకులను తొలగించుకొని చంద్రబాబు త్వరగా విడుదల కావాలని టీడీపీ నాయకులు వినాయకుడికి పూజలు చేశారు. జగన్ రెడ్డి అనే విఘ్నం నుండి విముక్తి ప్రసాదించాలని, చంద్రబాబు త్వరగా బయటకు రావాలని వేడుకున్నారు. 

శ్రీకాకుళంలో అరసవల్లి దేవస్థానం, విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఆలయం, విశాఖపట్నంలో సింహాచలం ఆలయం, తూర్పుగోదావరిలో అన్నవరం ఆలయం, పశ్చిమగోదావరి జిల్లాలో ద్వారక తిరుమల, కృష్ణా జిల్లాలో కనకదుర్గమ్మ ఆలయానికి ఆయా జిల్లాల నాయకులు పాదయాత్రలు నిర్వహించి పూజలు నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ 'బాబుతో నేను' కరపత్రాలను విస్తృతంగా పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు స్కిల్‌ డెవలప్ మెంట్‌ ద్వారా ఎంతో మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చారన్నారు. ఒక్క రూపాయి కూడా అవినీతి జరుగలేదని ఆ కంపెనీ యజమానులే చెబుతున్నా కూడా చంద్రబాబును కావాలని కక్షతో, తప్పుడు కేసులతో వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసిందన్నారు. 

ఎంతో మంది యువత స్కిల్‌ డెవలప్ మెంట్ ద్వారా ఉద్యోగాలు పొంది లక్షల రూపాయల వేతనాలతో ఆనందంగా జీవితాలు గడుపుతున్నారన్నది కూడా రుజువు అయిందని పేర్కొన్నారు. ఎటువంటి అవినీతికి తావు లేకుండా, ఒక్క కేసులో కూడా ముద్దాయి కాకుండా నిప్పులాంటి మనిషిగా బ్రతికిన మహోన్నతమైన వ్యక్తి చంద్రబాబును జైలుకు పంపి కక్ష సాధించడం వైసీపీ నీచ రాజకీయానికి పరాకాష్ఠ మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక, అణచివేత ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడడం ఖాయమని హెచ్చరించారు. 

ఈ నిరసన కార్యక్రమంలో పోలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతి రాజు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నక్కా ఆనంద్ బాబు, ఎండీ షరీఫ్, రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి, కొల్లు రవీంద్ర, గుమ్మడి సంధ్య రాణి, పార్లమెంట్ అధ్యక్షులు మల్లెల లింగా రెడ్డి, పులివర్తి నాని, జీవి ఆంజనేయులు, శ్రావణ్ కుమార్, గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, రాష్ట్ర, మండల నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

More Telugu News