women reservation bill: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు: ఎల్లుండి మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం!

  • దాదాపు మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు
  • ఈ నెల 20న బిల్లు ప్రవేశపెట్టవచ్చునని జోరుగా వార్తలు
  • ఏళ్లుగా మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం ఉండాలనే వాదన
Modi Government may produce women reservation bill in Parliament

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అయిదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో... దాదాపు మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఈ నెల 20న (బుధవారం) ఈ బిల్లును నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టవచ్చునని భావిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును దాదాపు ఏ పార్టీ కూడా వ్యతిరేకించే పరిస్థితి లేదు. ఇప్పటికే పలు పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ కూడా చేస్తున్నాయి. మోదీ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెడితే దాదాపు అన్ని పార్టీలు మద్దతిచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి.

ప్రస్తుత 17వ లోక్ సభలో 15 శాతం కంటే దిగువన మహిళా ఎంపీలు ఉన్నారు. 2022లో రాజ్యసభలో 28.3 శాతం మహిళలు ఉన్నారు. 1952లో లోక్ సభలో మహిళా ఎంపీలు 4.4 శాతం, రాజ్యసభలో కేవలం 2 శాతం ఉన్నారు. దాదాపు దేశంలో సగం జనాభా ఉన్న మహిళలకు కనీసం 33 శాతం వాటా ఉండాలనే వాదన ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రత్యేక సమావేశాల్లో మోదీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

More Telugu News