Baby with 26 fingers: 26 వేళ్లతో ఆడబిడ్డ జననం.. అమ్మతల్లి అవతారమంటూ కుటుంబసభ్యుల సంబరం

  • రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో అత్యంత అరుదైన ఘటన 
  • ఒక్కో చేతికీ ఏడు వేళ్లు, ఒక్కో కాలికి ఆరు వేళ్లతో ఆడబిడ్డ జననం
  • ధోలాఘడ్ అమ్మవారు తమ ఇంట అవతరించిందంటూ కుటుంబసభ్యుల సంబరం 
  • శిశువులో జన్యుమార్పులే అదనపు వేళ్లకు కారణమని వైద్యులు స్పష్టీకరణ
  • అదనపు వేళ్లు మినహా పూర్తి ఆరోగ్యంతో ఉన్న శిశువు
Baby with 26 fingers born in Rajasthan family saying it is goddess incarnation

మనుషులకు ఆరు వేళ్లు ఉండటమే అరుదైన విషయం. కానీ మొత్తం 26 వేళ్లతో ఆడబిడ్డ పుట్టిన అసాధారణ ఘటన రాజస్థాన్‌లో తాజాగా చోటుచేసుకుంది. దీంతో, బిడ్డ తల్లిదండ్రులతో పాటూ ఇతర కుటుంబసభ్యులు శిశువును అమ్మవారి అవతారంగా భావిస్తూ  మురిసిపోతున్నారు. అమ్మతల్లే తమ ఇంట కాలిడిందంటూ తమ అదృష్టాన్ని తలుచుకుని సంబరపడుతున్నారు. 

భరత్‌పూర్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల సర్జూ దేవి ఇటీవలే పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ, అసాధారణ రీతిలో శిశువు ఒక్కో చేయికి ఏడు వేళ్లు, ఒక్కో కాలికి ఆరు వేళ్లు చొప్పున మొత్తం 26 వేళ్లతో జన్మించింది. అది మినహా బిడ్డ పూర్తి ఆరోగ్యంగా ఉండటంతో ఆ కుటుంబం శిశువును ధోలాఘడ్ దేవి అమ్మవారి అవతారంగా భావిస్తోంది. ‘‘నా చెల్లి 26 వేళ్లున్న బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ అమ్మవారి అంశతో పుట్టిందని మేము బలంగా నమ్ముతున్నాం. చాలా సంతోషంగా ఉన్నాం’’ అని శిశువు మేనమామ మీడియాకు తెలిపారు. బిడ్డ తండ్రి గోపాల్ భట్టాచార్య సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.

అయితే, వైద్యులు మాత్రం శిశువు జన్యుక్రమంలో మార్పులే అదనపు వేళ్లకు కారణమని నమ్ముతారు. అన్ని వేళ్లు ఉన్నంత మాత్రాన ఆరోగ్యానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని స్పష్టం చేశారు. అయితే, ఇది అత్యంత అరుదైన ఘటనగా అభివర్ణించారు.

More Telugu News