Team India: శ్రీలంకకు దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్... ఆసియా కప్ విజేత భారత్

  • 8వ పర్యాయం ఆసియా కప్ ట్రోఫీ నెగ్గిన భారత్
  • ఇవాళ ఫైనల్లో లంకపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం
  • 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలిన లంక
  • 6.1 ఓవర్లలో కొట్టేసిన భారత ఓపెనర్లు
Team India wins 8th Asia Cup by beating Sri Lanka

అన్ని రంగాల్లో విశ్వరూపం ప్రదర్శించిన టీమిండియా ఆసియా కప్-2023 విజేతగా నిలిచింది. కొలంబోలో ఇవాళ ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఆతిథ్య శ్రీలంకను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా సొంతగడ్డపై లంకకు ఘోర పరాభవాన్ని మిగిల్చింది. 

తొలుత మహ్మద్ సిరాజ్ సెన్సేషనల్ బౌలింగ్ ప్రదర్శనతో లంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. సిరాజ్ 6 వికెట్లతో లంకను బెంబేలెత్తించాడు. హార్దిక్ పాండ్యా 3, బుమ్రా ఓ వికెట్ తీశారు. అనంతరం 51 పరుగుల లక్ష్యాన్ని భారత్ 6.1 ఓవర్లలో అలవోకగా ఛేదించింది. లంకకు ఏమాత్రం అవకాశం ఇవ్వని రీతిలో టీమిండియా యువ ఓపెనర్లు శుభ్ మాన్ గిల్, ఇషాన్ కిషన్ పని పూర్తి చేశారు. గిల్ 23, కిషన్ 21 పరుగులతో అజేయంగా నిలిచారు. 

సొంతగడ్డపై ఆడుతున్న లంక ఇంతటి దారుణమైన ఆటతీరు కనబరుస్తుందని ఎవరూ ఊహించలేదు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో లంక ఆటగాళ్లు తీవ్ర నిరాశతో కనిపించారు. కాగా, భారత్ కు ఇది 8వ ఆసియా కప్ టైటిల్. భారత్ గతంలో 1984, 1988, 1990-91, 1995, 2010, 2016, 2018లో ఆసియా కప్ విజేతగా నిలిచింది.

More Telugu News