Kakani Govardhan Reddy: చంద్రబాబును టీడీపీ నేతలు కూడా పట్టించుకోవడం లేదు: కాకాణి గోవర్ధన్ రెడ్డి

చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ ను టీడీపీ తట్టుకోలేకపోతోందన్న కాకాణి 
  • ప్రభుత్వాన్ని, జడ్జిలను, న్యాయవాదులను విమర్శిస్తున్నారని మండిపాటు
  • చంద్రబాబుకు ఎప్పుడో 15 ఏళ్ల జైలు శిక్ష పడాల్సిందని వ్యాఖ్య
TDP leaders not thinking about Chandrababu says Kakani

స్కిల్ డెవలప్ మెంట్ లో అవినీతికి పాల్పడినందుకే టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసిందని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ ను టీడీపీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నారని... అందుకే ప్రభుత్వాన్ని, జడ్జిలను, న్యాయవాదులను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ రాజ్యాంగ వ్యవస్థలను అవమానిస్తోందని చెప్పారు. ఓటుకు నోటు కేసులో చిక్కిన చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్ల పాలనలో ఏపీని అప్పుల పాలు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో చంద్రబాబును ఎవరూ పట్టించుకోవడం లేదని.. చివరకు ఆయనను టీడీపీ నేతలు కూడా పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. 

ఏదో జరిగిందని చెప్పేందుకు నారా లోకేశ్ ఢిల్లీకి వెళ్లాడని... అక్కడకు వెళ్లి ఏమీ చెప్పలేకపోయాడని కాకాణి అన్నారు. చంద్రబాబును జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ఏ లాయర్లను పట్టుకుంటే బాగుంటుందనే విషయంపై లోకేశ్ చర్చలు జరుపుతున్నారని విమర్శించారు. లోకేశ్ ను కూడా అరెస్ట్ చేస్తారని ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని... ఎందుకంటే లోకేశ్ కూడా అవినీతికి పాల్పడ్డాడనే విషయం వారికి తెలుసని చెప్పారు. చంద్రబాబు చేసిన అవినీతికి 15 ఏళ్ల జైలు శిక్ష ఎప్పుడో పడాల్సిందని అన్నారు.

More Telugu News