Anand Mahindra: నా చిన్ననాటి జ్ఞాపకాల్లో ఒకటి చోరీకి గురైంది.. ఆనంద్ మహీంద్రా భావోద్వేగ పోస్ట్

  • 80 ఏళ్లకుపైగా సేవలు అందించిన ఎరుపు రంగు డబుల్ డెక్కర్ బస్సులు
  • వాటికి వీడ్కోలు పలకాలని నిర్ణయించిన ‘బెస్ట్’
  • అక్టోబర్ మొదటి వారం నుంచి కనుమరుగు
Anand Mahindra gets emotional as Mumbai bids adieu to red double decker buses

ముంబై ప్రజా రవాణాలో 80 ఏళ్లకు పైగా కీలక పాత్ర పోషించిన ఎరుపు రంగు డబుల్ డెక్కర్ బస్సులకు వీడ్కోలు పలకాలని అధికారులు నిర్ణయించడంపై మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా భావోద్వేగంగా స్పందించారు. మరో వారం రోజుల్లో ఇవి ముంబై రోడ్ల నుంచి మాయం కానున్నాయి. 1990 నుంచి ఇవి పర్యాటకుల సైట్ సీయింగ్‌కే పరిమితమయ్యాయి. ఈ నాన్ ఏసీ డబుల్ డెక్కర్ డీజిల్ ఇంజిన్ బస్సులకు ముంబైలో వీడ్కోలు పలికేందుకు నిన్న పలువురు బస్ డ్రైవర్లు, కండక్టర్లు, ప్రయాణికులు ఒక చోట చేరారు. 

మరో వారం రోజుల్లో డబుల్ డెకర్ బస్సులు అదృశ్యం కానుండంపై ఆనంద్ మహీంద్రా ఎక్స్ ద్వారా విచారం వ్యక్తం చేశారు. ‘‘హలో ముంబై పోలీస్.. నా బాల్య స్మృతుల్లో ఒకటి చోరీకి గురవడాన్ని మీకు ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఐకానిక్ బస్సుల్లో రెండింటిని అయినా మ్యూజియంలో భద్రపరచాలని ముఖ్యమంత్రి, పర్యాటకశాఖ మంత్రి, బృహన్ ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్ టేకింగ్ (బెస్ట్)ను కోరుతూ ప్రయాణికులు లేఖలు రాశారు. 

1990 మొదట్లో ‘బెస్ట్’ దాదాపు 900 డబుల్ డెక్కర్ బస్సులను నడిపేది. ఆ తర్వాత క్రమంగా వాటి సంఖ్య 90కి పడిపోయింది. వాటి నిర్వహణ ఖర్చు భారీగా పెరిగిపోతుండడంతో 2008 తర్వాత వాటి సేవలను నిలిపివేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ ఐకానిక్ ఎరుపు బస్సుల స్థానంలో బ్యాటరీతో నడిచే నలుపు రంగు డబుల్ డెక్కర్ బస్సులను లీజుకు తీసుకున్నారు. ప్రస్తుతం ఇవి 25 వరకు ఉన్నాయి.

More Telugu News