Chief Justice Chandrachud: ఆ కాంట్రవర్సీ జోలికి వెళ్లదలుచుకోలేదు: చీఫ్ జస్టిస్ చంద్రచూడ్

  • రామ్‌జఠ్మలానీ స్మారకోపన్యాస కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ప్రసంగం
  • రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతంపై మాట్లాడదలుచుకోలేదన్న చీఫ్ జస్టిస్
  • కోర్టు పనితీరులో వ్యవస్థీకృత విధానాల రూపకల్పనకు ప్రయత్నిస్తున్నానని వెల్లడి 
Chief justice refuses to talk about basic structure doctrine in Ram jathamalani memorial lecture

న్యాయకోవిదుడు రామ్‌జఠ్మలానీ స్మారకోపన్యాస కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతంపై ప్రసంగించేందుకు నిరాకరించారు. ఆ కాంట్రవర్సీ జోలికి వెళ్లదలుచుకోలేదని స్పష్టం చేశారు. రాజ్యాంగ మౌలిక స్వరూప స్వభావ సిద్ధాంతంపై తన అభిప్రాయాలను తన తీర్పుల ద్వారానే వ్యక్తీకరిస్తానని తేల్చి చెప్పారు. కోర్టుకు ఆవల ఈ అంశంపై వ్యాఖ్యానించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ‘బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్‌తో దేశానికి ప్రయోజనం చేకూరిందా?’ అన్న అంశంపై ప్రసంగం సమయంలో చీఫ్ జస్టిస్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

రామ్‌జఠ్మలానీ అంటే తనకు ఎంతో గౌరవమే కానీ ఆయనలా వివాదాస్పద అంశాల జోలికి వెళ్లదలుచుకోలేదని చీఫ్ జస్టిస్ అన్నారు. అయితే, ప్రజలకు తెలియని సుప్రీంకోర్టు పనితీరు గురించి మాట్లాడేందుకు తాను అనుమతి తీసుకుని వచ్చినట్టు వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు పనితీరుపై ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోందని కూడా ఆయన చెప్పారు. లా రిపోర్ట్స్‌లో కూడా విమర్శలు ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. 

న్యాయవ్యవస్థ పనితీరుకు సంబంధించిన విధివిధానాలను వ్యవస్థీకృతం చేసేందుకు తాను ఎన్నో చర్యలు చేపట్టినట్టు జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. సందర్భానికి తగినట్టు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే పద్ధతి నుంచి స్థిరమైన వ్యవస్థీకృత విధానాల ఏర్పాటు కోసం కృషి చేస్తున్నట్టు వివరించారు. దీని వల్ల న్యాయవ్యవస్థలో పారదర్శకత, బాధ్యతాయుత వైఖరి ఇనుమడిస్తాయని చెప్పారు. న్యాయవ్యవస్థ పనితీరులో మానవత్వం కూడా వెల్లివిరుస్తుందన్నారు. కోర్టులో ఆధునిక సాంకేతికత వినియోగానికి పెద్దపీట వేస్తున్నట్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

More Telugu News