Team India: గిల్ సెంచరీ వృథా... విజయానికి చేరువగా వచ్చి ఓడిన భారత్

  • ఆసియా కప్ సూపర్-4లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్
  • 6 పరుగుల తేడాతో ఓటమిపాలైన రోహిత్ సేన
  • మొదట 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసిన బంగ్లాదేశ్
  • ఛేదనలో 49.5 ఓవర్లలో 259 పరుగులకు భారత్ ఆలౌట్
  • 133 బంతుల్లో 121 పరుగులు చేసిన గిల్... ఆఖర్లో పోరాడిన అక్షర్
Gill ton went in vein as Team India lost to Bangladesh in Asia Cup

ఆసియా కప్ సూపర్-4 చివరి లీగ్ మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. బంగ్లాదేశ్ తో కొలంబోలో జరిగిన పోరులో భారత్ 6 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. చివరి ఓవర్లో 12 పరుగులు కొడితే విజయం దక్కుతుందనగా... క్రీజులో ఉన్న షమీ తొలి మూడు బంతులను వృథా చేశాడు. నాలుగో బంతిని ఫోర్ కొట్టినా, ఆ తర్వాత బంతికి డబుల్ తీయబోయి రనౌట్ అయ్యాడు. దాంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేయగా... లక్ష్యఛేదనలో భారత్ 49.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌట్ అయింది. 

టీమిండియా ఇన్నింగ్స్ లో హైలైట్ అంటే ఓపెనర్ శుభ్ మాన్ గిల్ సూపర్ సెంచరీ గురించే చెప్పాలి. ఓవైపు వికెట్లు పడుతున్నా, ఎంతో ఒత్తిడిలో కూడా నిబ్బరంగా ఆడిన గిల్ 133 బంతుల్లో 121 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 8 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. 

అయితే కీలక దశలో గిల్ అవుట్ కావడంతో భారత్ గెలుపు అవకాశాలను ప్రభావితం చేసింది. మధ్యలో సూర్యకుమార్ యాదవ్ 26 పరుగులు చేసినా, అతడు కూడా సులువుగా వికెట్ అప్పగించేసి పెవిలియన్ చేరాడు. 

ఆఖర్లో అక్షర్ పటేల్ పోరాటం భారత్ ను గెలుపు ముంగిట నిలిపింది. అక్షర్ 34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 42 పరుగులు చేశాడు. అక్షర్ ను ముస్తాఫిజూర్ అవుట్ చేయడంతో జట్టును గెలిపించే బాధ్యత టెయిలెండర్లు షమీ, ప్రసిద్ధ్ కృష్ణలపై పడింది. బంగ్లాదేశ్ కొత్త కుర్రాడు టాంజిమ్ హసన్ సకీబ్ విసిరిన ఆఖరి ఓవర్లో షమీ పేలవంగా బ్యాటింగ్ చేయడంతో భారత్ కు ఓటమి తప్పలేదు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజూర్ రెహ్మాన్ 3, టాంజిమ్ హసన్ సకీబ్ 2, మహెదీ హసన్ 2, మెహెదీ హసన్ మిరాజ్ 1, కెప్టెన్ షకీబల్ హసన్ 1 వికెట్ తీశారు. 

కాగా, సూపర్-4లో బంగ్లాదేశ్ జట్టుకు ఇదే తొలి విజయం. ఇక, ఈ నెల 17న జరిగే ఫైనల్లో భారత్, శ్రీలంక తలపడనున్నాయి. ఈ టైటిల్ సమరానికి కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా నిలవనుంది.

More Telugu News