Sukhvinder Singh Sukhu: తాను పొదుపు చేసిన డబ్బంతా వరద బాధితులకు ఇచ్చేసిన హిమాచల్ ప్రదేశ్ సీఎం

  • ఇటీవల హిమాచల్ ప్రదేశ్ ను ముంచెత్తిన వర్షాలు, వరదలు
  • రాష్ట్రంలో తీవ్ర ఆస్తి నష్టం... 260 మందికి పైగా మృతి
  • తన బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.51 లక్షలు విరాళంగా అందించిన సీఎం 
Himachal Pradesh CM donates his entire savings to flood hit people in the state

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదలకు రాష్ట్రంలో వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. అలాంటి వారి కోసం ఆయన భారీ విరాళం ప్రకటించారు. తాను పొదుపు చేసిన డబ్బంతా వరద బాధితులకు అందించారు. 

మొత్తం 3 బ్యాంకు అకౌంట్లలో ఉన్న రూ.51 లక్షల మొత్తాన్ని డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కు అందజేశారు. తద్వారా రాష్ట్ర నేతలకే కాదు, దేశ నేతలకు కూడా ఆయన స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అవసరంలో ఉన్న ప్రజలకు ఇది తనవంతు సాయం అని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు వెల్లడించారు. వరద బాధితుల కష్టాలు చూసి చలించిపోయిన చిన్నపిల్లలు సైతం తమ కిడ్డీ బ్యాంకులు పగులగొట్టి, తాము దాచుకున్న డబ్బును విరాళంగా అందిస్తున్నారని వివరించారు. 

ఇటీవల నైరుతి రుతుపవనాల సీజన్ ఆరంభంలో హిమాచల్ ప్రదేశ్ భారీ వర్షాలు ముంచెత్తాయి. దాంతో కొండచరియలు విరిగిపడడం, భారీ వరదలు సంభవించడం వంటి విపత్తులు చోటుచేసుకున్నాయి. 260 మందికి పైగా మృత్యువాత పడ్డారు. దాదాపు రూ.8 వేల కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది.

More Telugu News