YS Sharmila: కాంగ్రెస్ పెద్దలతో షర్మిల టచ్‌లో ఉన్నారు: కేసీ వేణుగోపాల్

congress leader KC Venugopal on YS Sharmila
  • రేపటి సీడబ్ల్యుసీ సమావేశం గేమ్ ఛేంజర్‌గా మారుతుందని వ్యాఖ్య
  • సోనియాగాంధీ ప్రకటించిన గ్యారంటీ స్కీమ్‌లు ప్రజల్లోకి తీసుకు వెళ్తామని వెల్లడి
  • తెలంగాణ అత్యంత అవినీతి రాష్ట్రంగా మారిందని విమర్శ
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తమ పార్టీ పెద్దలతో టచ్‌లోనే ఉన్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన తుక్కుగూడలో మీడియాతో మాట్లాడుతూ... రేపటి సీడబ్ల్యుసీ సమావేశం గేమ్ ఛేంజర్‌గా ఉంటుందన్నారు. ఈ సమావేశాలు చారిత్రాత్మకంగా నిలుస్తాయన్నారు. ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు సీడబ్ల్యుసీ సభ్యులు హాజరవుతారన్నారు. రేపటి సమావేశంలో తొంబై మంది పాల్గొంటారని, ఎల్లుండి విస్తృతస్థాయి సమావేశంలో 159 మంది పాల్గొంటారన్నారు.

18 మంది నేతలు తెలంగాణవ్యాప్తంగా పర్యటించి సోనియా గాంధీ ప్రకటించిన గ్యారంటీ స్కీమ్‌లను ప్రజల్లోకి తీసుకువెళ్తారన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలపై సీడబ్ల్యుసీ చర్చిస్తుందన్నారు. రానున్న తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అత్యంత అవినీతిమయ రాష్ట్రంగా మారిందన్నారు. మోదీ, కేసీఆర్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు.
YS Sharmila
kc venugopal
Congress
Telangana

More Telugu News