YS Jagan: ఏపీలో మొత్తం 28 మెడికల్ కాలేజీలు ఉండబోతున్నాయి: వైఎస్ జగన్

  • ఒకేసారి ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించిన ముఖ్యమంత్రి
  • విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలలో ప్రారంభం
  • వచ్చే ఏడాది మరో ఐదు ప్రారంభిస్తామన్న ముఖ్యమంత్రి
YS Jagan inaugarates 5 medical colleges in AP

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఐదు మెడికల్ కాలేజీలను ఒకేసారి ప్రారంభించారు. విజయనగరం గాజురేగలో 70 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీని ఆయన ప్రారంభించారు. మిగతా నాలుగు మెడికల్ కాలేజీలను (రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల) వర్చువల్‌‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... ఏ చదువు అయినా పేదవారికి అందుబాటులో ఉండాలన్నారు.

ఈరోజు ఐదు మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తున్నామని, వచ్చే ఏడాది మరో ఐదు ప్రారంభిస్తామని, మొత్తంగా 17 మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మొత్తంగా ఏపీలో 28 మెడికల్ కాలేజీలు ఉండే విధంగా వేగంగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం రూ.8,480 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్‌కు ఒక మెడికల్ కాలేజీ వస్తుందన్నారు. ఈ కాలేజీల వల్ల కొత్తగా మరో 2,250 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2185 సీట్లు ఉన్నాయని, పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణంతో ఎంబీబీఎస్ సీట్లు 4735కు పెరుగుతాయన్నారు.

వీటితో పాటు ఇప్పటికే ఉన్న మెడికల్ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పిస్తామని చెప్పారు. ఈ కాలేజీల్లో జీరో వేకెన్సీ పాలసీని తీసుకు వస్తామన్నారు. ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాక భవిష్యత్తులో మరో 2,737 పీజీ సీట్లు కూడా రానున్నాయన్నారు. ఈ రోజు ప్రారంభమవుతోన్న విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీల ద్వారా కొత్తగా 750 ఎంబీబీఎస్ సీట్లు వస్తున్నాయన్నారు. వచ్చే ఏడాది పాడేరు, పులివెందుల, మార్కాపురం, మదనపల్లి, ఆదోనీ తదితర వెనుకబడిన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలను నిర్మిస్తామన్నారు.

More Telugu News