Nara Brahmani: సోషల్ మీడియాలో ఆసక్తికర వీడియో పంచుకున్న నారా బ్రాహ్మణి

  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • చంద్రబాబుకు పెరుగుతున్న మద్దతు... అరెస్ట్ ను ఖండిస్తున్న పొరుగు నేతలు
  • బ్రాహ్మణిని కలిసిన ఓ చిన్నారి... చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు
Nara Brahmani shares interesting video in social media

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు అన్ని వైపుల నుంచి మద్దతు పెరుగుతోంది. పొరుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు సైతం పార్టీలకు అతీతంగా చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు కోడలు, నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి సోషల్ మీడియాలో ఆసక్తికర వీడియో పంచుకున్నారు. 

ఓ చిన్నారి బ్రాహ్మణి వద్దకు వచ్చి చంద్రబాబుకు మద్దతు పలకడాన్ని ఆ వీడియోలో చూడొచ్చు. గతంలో టీడీపీ హయాంలో చంద్రన్న పెళ్లికానుక పథకం తీసుకువరావడం తెలిసిందే. ఆ పథకం ద్వారా లబ్ది పొంది పెళ్లి చేసుకున్న ఓ దంపతులకు కుమారుడే సదరు చిన్నారి. అజిత్ కుమార్ అనే ఆ బాలుడు తనను కలవడం పట్ల బ్రాహ్మణి స్పందించారు. 

"చంద్రబాబు, లోకేశ్ లకు మద్దతు పలికేందుకు ఆ పిల్లవాడు చాలా దూరం నుంచి వచ్చాడు. ఆ చిన్నారి అభిమానం నాకెంతగానో నచ్చింది. ఆ అబ్బాయి తల్లిదండ్రులు చంద్రన్న పెళ్లికానుక పథకం ద్వారా ఒక్కటయ్యారు" అని బ్రాహ్మణి వివరించారు. కాగా, చంద్రబాబు విడుదలయ్యే వరకు తాను కూడా పోరాడతానని ఆ బాలుడు చెప్పడం నారా బ్రాహ్మణిని ఆకట్టుకుంది.

More Telugu News