Chennai: ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడుతూ వృద్ధురాలి భిక్షాటన.. యూట్యూబర్‌ సాయంతో కొత్త జీవితం.. నెటిజన్లను కదిలిస్తున్న వీడియో

  • చెన్నై  వీధుల్లో ఇంగ్లిష్ అనర్గళంగా మాట్లాడుతూ వృద్ధురాలి భిక్షాటన
  • ఆమె కథ తెలుసుకుని కలత చెందిన స్థానిక యూట్యూబర్
  • పూర్వాశ్రమంలో మహిళ టీచర్ అని తెలిసి ఆమెతో ఇన్‌స్టా ఛానల్ ప్రారంభించిన యువకుడు
  • వృద్ధురాలి పాఠాలకు దక్కుతున్న ఆదరణ
  • ఛానల్‌తో వచ్చే ఆదాయంతో ఆమెను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసేందుకు యువకుడి ప్రయత్నం
Chennai man finds elderly woman fluent in English begging on streets helps her start teaching channel

ఆమెది 81 ఏళ్ల ముదిమి వయసు! అనర్గళంగా ఇంగ్లిష్‌లో మాట్లాడుతోంది. కానీ, ఆమె వృత్తి మాత్రం భిక్షాటన. చెన్నై నగర వీధుల్లో ఆమె ఇంగ్లిష్‌లో యాచన చేస్తున్న వైనం ఓ యూట్యూబర్‌ను కదిలించింది. వెంటనే ఆమె విషయాలు తెలుసుకున్న అతడు ఇన్‌స్టాలో షేర్ చేయడంతో ఈ ఉదంతం వైరల్‌గా మారింది. అయితే, యువకుడు అక్కడితో ఆగిపోలేదు. ఆమెను భిక్షాటన నుంచి మళ్లించి ప్రత్యామ్నాయ ఉపాధిమార్గం చూపించాలనుకున్నాడు. చివరకు అనుకున్న లక్ష్యం దిశగా తొలి అడుగులు వేశాడు. ప్రస్తుతం ఈ యువకుడు మంచి మనసు తెలిసి నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. 

బర్మాకు చెందిన మెర్లిన్‌ కొన్నేళ్ల క్రితం ఓ భారతీయుడిని పెళ్లాడి చెన్నైకి వచ్చేశారు. బర్మాలో ఉండగా ఆమె ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేసేవారు. కానీ విధి ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. ఆమె కుటుంబంలోని వారందరూ ఒక్కొక్కరుగా మరణించడంతో ముదిమి వయసులో ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. చివరకు యాచకవృత్తిని ఎంచుకుంది. భిక్షాటన చేయగా వచ్చే డబ్బులు చాలక ఆమె నిత్య నరకం అనుభవిస్తోంది. 

అక్షరాస్యురాలైన మహిళ అనర్గళంగా ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ కూడా ఇంతటి దీనిస్థితికి దిగజారడం యూట్యూబర్‌ మహ్మమద్ ఆషిక్‌ను తొలుత ఆశ్చర్యపరిచింది. ఆ తరువాత అసలు విషయం తెలిసి అతడి మనసంతా వేదనతో నిండిపోయింది. దీంతో, ఆమె సమస్యకు పరిష్కారం చూపేందుకు అతడు స్వయంగా రంగంలోకి దిగాడు. తొలుత ఆమె గురించిన విశేషాలతో ఓ వీడియో రూపొందించి నెట్టింట షేర్ చేశాడు. వృద్ధురాలి ఉదంతం అనేక మందిని కదిలించడంతో వీడియో విపరీతంగా వైరల్‌ అయింది.

వృద్ధురాలికి కొత్తగా వచ్చిన ఈ ప్రాచుర్యంతో ఆమెను మళ్లీ టీచింగ్ వృత్తిని ప్రారంభించేలా చేసేందుకు ఓ ప్రణాళిక అమలు చేశారు. తొలుత ఆమె కోసం ఓ ఇన్‌స్టా ఛానల్ ప్రారంభించాడు. అందులో వృద్ధురాలితో పాఠాలు చెప్పిస్తూ ఆమె ఆర్థికంగా నిలదొక్కుకునేలా సాయపడుతున్నాడు. ప్రస్తుతం ఆమె ఇంగ్లిష్ పాఠాలకు జనాల్లో మంచి ఆదరణ దక్కుతోంది. ఈ విషయాలన్నీ అతడే స్వయంగా నెట్టింట పంచుకున్నాడు. యువకుడి నిస్వార్థసేవానిరతి చూసి నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తూ అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

More Telugu News