New Delhi: అప్పు తిరిగివ్వమన్న సహోద్యోగిని హత్య.. మొహంపై యాసిడ్.. రైల్వే ఉద్యోగి ఘాతుకం

New Delhi Man murders woman for pressurizing him to repay the loan taken
  • ఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని టెక్నికల్ సూపర్‌వైజర్ ఒడిగట్టిన దారుణం
  • సహోద్యోగినిని కార్యాలయం నుంచి బయటకు రప్పించి హత్య
  • సాక్ష్యాధారాలు దొరక్కుండా ముఖంపై యాసిడ్ పోసిన వైనం
  • పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన నిందితుడు 
  • హత్యా నేరం కింద నిందితుడి అరెస్ట్
ఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని పనిచేసే ఓ వ్యక్తి తన సహ ఉద్యోగినిని అప్పు తిరిగివ్వమన్నందుకు దారుణంగా హత్య చేశాడు. ఆమెను కత్తితో గాయపరిచి అంతమొందించిన అతడు మృతదేహాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ముఖంపై యాసిడ్ పోసి కాల్చేశాడు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. 

మహమ్మద్ జాకీర్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో టెక్నికల్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. అదే స్టేషన్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్న ఓ మహిళ అతడికి 2018-19 మధ్య కాలంలో విడతలుగా రూ.11 లక్షలు అప్పు ఇచ్చింది. తాను స్వయంగా మరో చోట అప్పు తీసుకుని మహమ్మద్‌ అడిగిన మొత్తం సమకూర్చింది. 

కాగా, సెప్టెంబర్ 8న ఆమె అకస్మాత్తుగా అదృశ్యమైంది. దీంతో, మరుసటి రోజు మహిళ కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తరువాతి రోజున ఆమెకు తన తల్లి మృతి చెందిందంటూ కాల్ రావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దర్యాప్తులో భాగంగా పోలీసులకు పలు కీలక అధారాలు లభించాయి. సెప్టెంబర్ 8న మధ్యాహ్నం మహిళ ఆఫీసు నుంచి బయటకు వెళ్లినట్టు వారు గుర్తించారు. అదే రోజున జాకీర్ కూడా సెలవులో ఉన్నట్టు గుర్తించారు. అతడికి ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా ఫోన్ స్విచ్ఛాప్ అని వచ్చింది. దీంతో, పోలీసులు నిందితుడి కోసం 60 ప్రాంతాల్లో 20 గంటల పాటు వెతికి చివరకు అదుపులోకి తీసుకున్నారు. 

విచారణ సందర్భంగా, నిందితుడు జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చాడు. అప్పు తీర్చమంటూ మహిళ తనపై ఒత్తిడి తెస్తోందని, దీంతో ఆమెను శాశ్వతంగా అడ్డుతొలగించుకునేందుకు ప్రణాళిక వేసుకున్నట్టు తెలిపాడు. ఈ క్రమంలో బాధితురాలిని తొలుత నోయిడాలోని నాలెడ్జ్ పార్క్ ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపేశాడు. ఆపై ఆమెను ఎవరూ గుర్తుపట్టకుండా ముఖంపై యాసిడ్ పోశాడు. అనంతరం, కత్తి, యాసిడ్ బాటిల్‌ను సమీపంలో ఉన్న పొదల్లో దాచి పెట్టాడు. దీంతో పోలీసులు అతడిని హత్యా నేరం కింద అదుపులోకి తీసుకున్నారు.
New Delhi
Indian Railways
Crime News

More Telugu News