ScrubTyphus: స్క్రబ్ టైపస్‌తో అనంతపురం జిల్లా యువకుడి మృతి.. జిల్లాలో ఇదే తొలికేసు

  • జ్వరంతో బాధపడుతూ పోతుకుంట యువకుడు మధు మృతి
  • స్క్రబ్ టైపస్ వ్యాధితో మృతి చెందినట్టు నిర్ధారణ
  • కీటకం కుట్టడం ద్వారానే మనుషులకు ఈ వ్యాధి వస్తుందన్న అధికారులు
Anantapur Dist Youth Died With Scrub Typhus Disease

అనంతపురం జిల్లా ధర్మవరం మండలం పోతుకుంటకు చెందిన గవ్వల మధు(20) నిన్న ‘స్క్రబ్ టైపస్’ అనే వ్యాధితో మృతి చెందడం జిల్లాలో కలకలం రేపింది. ఇలాంటి వ్యాధితో ఒకరు మరణించడం జిల్లాలో ఇదే తొలిసారి. 15 రోజుల క్రితం మధు జ్వరం బారినపడడంతో ధర్మవరం, అనంతపురంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చూపించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గత నెల 31న చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న ప్రాణాలు విడిచాడు.

మధు స్క్రబ్ టైపస్ వ్యాధితోనే మృతి చెందినట్టు ప్రచారం జరగడంతో అప్రమత్తమైన జిల్లా వైద్యాధికారులు వెంటనే మధు స్వగ్రామమైన పోతుకుంటకు ప్రత్యేక బృందాన్ని పంపారు. ఆసుపత్రి రికార్డుల్లో మధు స్క్రబ్ టైపస్‌తోనే మృతి చెందినట్టు ఉండడాన్ని ఈ బృందం గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక పంపింది. ఇది ఓ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని, కీటకం కుట్టడం ద్వారా మనిషికి సోకుతుందని తెలిపారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు గ్రామంలో కీటక నివారిణి స్ప్రే చేశారు. మధు కుటుంబ సభ్యులను పరిశీలనలో ఉంచారు.

More Telugu News