Chandrababu: చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ‘బాబుతో నేను’ రిలే నిరాహార దీక్షలు... ఫొటోలు ఇవిగో!

TDP protests state wide after Chandrababu arrest
  • స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్
  • చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ నేతల్లో ఆగ్రహావేశాలు
  • ఏపీలో టీడీపీ శ్రేణుల నిరసన జ్వాలలు
  • టీడీపీ నిరసనలకు పలు పార్టీల మద్దతు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక తప్పుడు కేసుతో అక్రమ అరెస్టు చేశారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందంటూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు ‘బాబుతో నేను’ పేరుతో రిలే నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టారు. 

నేడు రెండో రోజు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ చర్యలను తూర్పారబట్టారు. చంద్రబాబుపై ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నాడని విమర్శించారు. 

యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేశారని, రెండున్నర లక్షల మందికి శిక్షణ ఇచ్చి, 80వేల మంది యువత మెరుగైన ఉద్యోగాలు పొందేలా చర్యలు తీసుకున్నారని వివరించారు. నాలుగున్నర సంవత్సరాలుగా జగన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ అనేది లేకుండా చేసి చంద్రబాబుపై కక్ష సాధింపులకు దిగడం దుర్మార్గం అని ఎలుగెత్తారు. 

అవినీతి జరిగిందంటున్న స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలనే గతంలో విశాఖ వేధికగా జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో తమ ఆస్తిగా చూపించారని టీడీపీ నేతలు ఆరోపించారు. అంతకు ముందు స్కిల్ డెవలప్మెంట్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని, అది తమ ఘనతే అన్నట్లు భారీ ప్రకటనలు గుప్పించుకున్నారని వెల్లడించారు. అప్పుడు అవినీతి కనిపించలేదా అని ప్రశ్నించారు. 

కాగా తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న దీక్షలకు జనసేన, సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా, ఎమ్మార్పీఎస్, జై భీం పార్టీ నాయకులు సంఘీభావం తెలియజేశారు. దీక్ష శిబిరం వద్ద ఏర్పాటు చేసిన ‘బాబుతో నేను’ బోర్డుపై సంతకాలు చేసి తమ మద్దతు తెలియజేశారు. చంద్రబాబు జైలు నుంచి త్వరగా బయటకు రావాలని కోరుతూ పలు నియోజకవర్గాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. 

ఈ నిరసన దీక్షలలో పోలిట్‌బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బొండా ఉమామహేశ్వరరావు, పార్లమెంట్ అధ్యక్షులు కూన రవికుమార్, కిమిడి నాగర్జున, పల్లా శ్రీనివాసరావు, బుద్దా నాగజగదీశ్వరరావు, జ్యోతుల నవీన్, రెడ్డి అనంతకుమారి, కె.ఎస్ జవహార్, గన్ని వీరాంజనేయులు, కొనకళ్ళ నారాయణ, నెట్టెం రాఘురాం, తెనాలి శ్రావణ్ కుమార్, జి.వి ఆంజనేయులు, మల్లెల రాజశేఖర్ గౌడ్, బి.టి నాయుడు, బి.కె పార్థసారథి, మల్లెల లింగారెడ్డి, గొల్లా నరసింహ యాదవ్, పులివర్తి నాని, నియోజకవర్గ ఇంఛార్జులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, పార్లమెంట్, నియోజకవర్గ, మండల నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జులు తదితరులు పాల్గొన్నారు.
Chandrababu
Arrest
TDP
Protests
Andhra Pradesh

More Telugu News