G. Kishan Reddy: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌, కవితకు నోటీసులపై స్పందించిన కిషన్ రెడ్డి

  • చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం సరికాదన్న కిషన్ రెడ్డి
  • ఏవైనా ఆరోపణలు ఉంటే నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని వ్యాఖ్య
  • ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి విషయంలో ఇలాగే జరిగిందని వెల్లడి
  • తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు లేదని స్పష్టీకరణ
Kishan Reddy responds on TDP chief Chandrababu Naidu arrest

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి అరెస్ట్‌పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మాజీ సీఎంను అరెస్ట్ చేసిన విధానం సరికాదని వ్యాఖ్యానించారు. ఆయనపై ఏవైనా ఆరోపణలు ఉంటే కనుక నోటీసులు ఇచ్చి పిలిచి ప్రశ్నించాలన్నారు. విచారణ తర్వాత అరెస్టుపై నిర్ణయం తీసుకోవాలన్నారు.

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా విషయంలోను ఇలాగే జరిగిందన్నారు. ఆయనను దర్యాఫ్తు సంస్థలు విచారించిన తర్వాత ఆధారాలు చూపించి అరెస్ట్ చేశారన్నారు. రాజకీయ కక్షతో ఎవరు వ్యవహరించినా సరికాదని, అలాంటివి ఉండకూడదన్నారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు వచ్చిన విషయం తనకు తెలియదని చెప్పారు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్‌కు, తెలంగాణ బీజేపీకి సంబంధం ఏమిటని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణలో తమకు ఏ పార్టీతోనూ పొత్తులు లేవని స్పష్టం చేశారు.

More Telugu News