Rajasthan Cop: వచ్చే ఎన్నికల్లో బీజేపీ టికెట్ కోరుతూ కరపత్రాలు ప్రింట్ చేయించిన పోలీసు అధికారి.. విధుల నుంచి తొలగింపు

Rajasthan cop print pamphlets seeks BJP ticket removed
  • రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో ఘటన
  • ధోల్‌పూర్ బసేడీ అసెంబ్లీ టికెట్ ఆశిస్తూ కరపత్రాలు
  • స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేశానన్న ఎస్ఎహ్‌వో
రాజస్థాన్‌లో ఓ పోలీసు అధికారి బీజేపీ టికెట్ కోరుతూ కరపత్రాలు ముద్రించడం వివాదాస్పదమైంది. సోషల్ మీడియాలో ఇవి వైరల్ కావడంతో స్పందించిన ఉన్నతాధికారులు ఆయనను పోలీస్ స్టేషన్ విధుల నుంచి తప్పించారు. భరత్‌పూర్ జిల్లాలోని వైర్ పోలీస్ స్టేషన్‌ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) ప్రేమ్ సింగ్ భాస్కర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ధోల్‌పూర్‌లోని బసేడీ అసెంబ్లీ నుంచి బీజేపీ టికెట్ కోరుతూ యూనిఫాంలో ఉన్న ఫొటోతో కరపత్రాలు ముద్రించారు.  

ఆ కరపత్రాల్లో ఆయన రాజకీయ వివరాలు, కుటుంబ నేపథ్యాన్ని కూడా వివరించారు. ఇవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయి పోలీసు ఉన్నతాధికారుల దృష్టిలో పడ్డాయి. దీనిని తీవ్రంగా పరిగణించి పోలీస్ స్టేషన్ విధుల నుంచి తొలగించి పోలీస్ లైన్స్‌కు పంపారు. రాజకీయ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నందుకు ఆయనను తక్షణం ఎస్‌హెచ్‌వో విధుల నుంచి తప్పించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘటనపై భాస్కర్ మాట్లాడుతూ.. తాను స్వచ్ఛంద పదవీ విరమణ కోసం అప్లికేషన్ పెట్టుకున్నట్టు పేర్కొన్నారు. తాను 34 ఏళ్లుగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌‌లో పనిచేస్తున్నట్టు చెప్పారు. ఇప్పుడు తాను రాజకీయాల్లో చేరి సమాజసేవ చేయాలనుకుంటున్నట్టు చెప్పారు.
Rajasthan Cop
BJP Ticket
Pamphlets
Dholpur District
Basedi Assembly Seat

More Telugu News