Shanti Dhariwal: ఎఫైర్ల కారణంగా విద్యార్థుల ఆత్మహత్యలు.. రాజస్థాన్ మంత్రి వ్యాఖ్య

  • కోటాలో విద్యార్థి మరణాలపై మంత్రి శాంతి ధరీవాల్ స్పందన
  • విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించి ప్రతి కేసుపై లోతైన దర్యాప్తు జరపాలని సూచన
  • తోటి వారికంటే వెనబడ్డామన్న భావన కూడా ఆత్మహత్యలకు దారి తీస్తోందని వెల్లడి
Rajasthan minister says affair parental pressure reasons for student suicide

జాతీయ స్థాయి ఎంట్రన్స్ పరీక్షల కోచింగ్‌కు ప్రధాన కేంద్రమైన రాజస్థాన్‌లోని కోటాలో తరచూ వెలుగు చూస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్ర మంత్రి శాంతి ధరీవాల్ స్పందించారు. ఎఫైర్లు, తల్లిదండ్రుల ఒత్తిడి విద్యార్థులను ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయని చెప్పారు. ఇటీవల కోటాలో కోచింగ్ తీసుకుంటున్న 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. దీనిపై మంత్రి మాట్లాడుతూ ‘‘ప్రతి కేసులోనూ విచారణ జరపాల్సిన అవసరం ఉంది. తాజాగా ఝార్ఖండ్ బాలిక ఆత్మహత్య కేసులో ఆమెకు ఎఫైర్ ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. ఆమె సూసైడ్ లెటర్ రాసి పెట్టి బలవన్మరణానికి పాల్పడింది’’ అని ధరీవాల్ చెప్పారు. మంగళవారం బాలిక తన గదిలో ఉరివేసుకున్న విషయాన్ని అక్కడి వారు గుర్తించారు. ఆమె నీట్‌కు ప్రిపేర్ అయ్యేందుకు కోటాకు వచ్చింది. 

‘‘విద్యార్థుల ఆత్మహత్యలకు కారణాలు తెలుసుకునేందుకు లోతైన దర్యాప్తు జరపాల్సి ఉంది. ఎఫైర్ల కారణంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఉదంతాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. బీహార్ నుంచి వచ్చే ఓ యువకుడికి తోటివారి కంటే తక్కువ ప్రతిభ ఉన్నట్టు భావిస్తే అతడు బలవన్మరణానికి పాల్పడే అవకాశం ఉంది’’ అని ఆయన అన్నారు. చదువులో ముందుండాలంటూ తల్లిదండ్రులు తెచ్చే ఒత్తిడి కూడా విద్యార్థి మరణాలకు ఓ కారణమని తెలిపారు. 

ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు రెండు లక్షల మంది కోటాలో నీట్, జేఈఈ వంటి పరీక్షలకు కోచింగ్ కోసం వెళుతుంటారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ ఏడాది ఇప్పటివరకూ 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2020-21 కాలంలో కరోనా కారణంగా విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చిన సమయంలో ఎటువంటి ఆత్మహత్యలు లేకపోవడం గమనార్హం. కాగా, ఆత్మహత్యలు నిరోధించేందుకు విద్యార్థుల గదుల్లోని ఫ్యాన్లకు స్ప్రింగులు ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ అకామడేషన్ కల్పించే వారికి ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News