Chandrababu: చంద్రబాబు అరెస్ట్... ఇవాళ కూడా టీడీపీ నేతల నిరసనలు, పలుచోట్ల గృహ నిర్బంధాలు

  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • భగ్గుమంటున్న టీడీపీ నేతలు
  • రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు
  • నల్ల జెండాలతో ప్రదర్శనలు
  • సైకో పోవాలి సైకిల్ రావాలని నినాదాలతో హోరెత్తించిన కార్యకర్తలు
TDP takes up huge protests state wide

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, శ్రేణులు నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో సామూహిక రిలే నిరాహార దీక్షలు చేప్టటారు. 

'బాబుతో నేను' పేరుతో నిర్వహించిన రిలే నిరాహార దీక్ష పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. నల్ల జెండాలు పట్టుకొని  'సైకో పోవాలి - సైకిల్ రావాలి', 'డౌన్ డౌన్ జగన్' అంటూ నినాదాలతో హోరెత్తించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కుట్రలు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు చేస్తున్న దీక్ష శిబిరాన్ని జనసేన, సీపీఐ, సీపీఎం, లోక్ సత్తా, ఎమ్మార్పీఎస్, జై భీమ్ పార్టీ నాయకులు సందర్శించి సంఘీభావం తెలియజేశారు. 

దీక్ష శిబిరం వద్ద ఏర్పాటు చేసిన బోర్డులో సామాన్య ప్రజల చంద్రబాబు అరెస్ట్‌పై తమ అభిప్రాయాలను తెలియజేశారు. చంద్రబాబు త్వరగా జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ పలు నియోజకవర్గాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. 

పలు నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలను పోలీసులు అడ్డుకున్నారు. పలువురు టీడీపీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ రోజు ఉదయం నుంచే పలువురు టీడీపీ నేతలను గృహనిర్బంధం చేశారు. అయినప్పటికీ టీడీపీ నేతలు పలువురు ప్రభుత్వ నిర్బంధాలను తప్పించుకుని తమ నిరసనలను కొనసాగించారు. 

సాలూరులో చంద్రబాబుని అరెస్టుకు నిరసిస్తూ ఒక కార్యకర్త గుండు గీసుకుని నిరసన తెలిపారు. విశాఖలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నిరసన తెలుపుతున్న గంటా శ్రీనివాసరావును హౌస్ అరెస్ట్ చేశారు. రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే వెలగపూడి, పల్లా శ్రీనివాస్ ను పోలీసులు అడ్డుకున్నారు. 

పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును మూడు రోజుల నుంచి గృహ నిర్భంధం చేయగా తప్పించుకొని రిలే నిరహారదీక్షలో పాల్గొన్నారు. ప్రొద్దుటూరులో... చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని ప్రార్థిస్తూ టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి తన నివాసం నుంచి తిరుమలకు పాదయాత్రగా వెళ్లారు. 

కాగా, టీడీపీ రిలే నిరాహారదీక్షలలో పోలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చియ్యచౌదరి, బొండా ఉమామహేశ్వరరావు, ఎన్.ఎండి ఫరూక్, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, పార్లమెంట్ అధ్యక్షులు కిమిడి నాగార్జున, పల్లా శ్రీనివాసరావు, జ్యోతుల నెహ్రు, కె.ఎస్ జవహార్, గన్నీ వీరాంజనేయులు, కొనకళ్ళ నారాయణ, నెట్టెం రఘురాం, తెనాలి శ్రావణ్ కుమార్, జీవీ ఆంజనేయులు, మల్లెల రాజశేఖర్ గౌడ్, బి.టి నాయుడు, బి.కె పార్థసారథి, గొల్ల నరసింహ యాదవ్, పులివర్తి వెంకట మణిప్రసాద్, ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు, గణబాబు, వేగుళ్ళ జోగేశ్వరరావు, ఆదిరెడ్డి భవాని, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గద్దె రామ్మోహన్ రావు, పయ్యావుల కేశవ్, నియోజకవర్గ ఇంఛార్జులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, పార్లమెంట్, నియోజకవర్గ, మండల నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జులు తదితరులు పాల్గొన్నారు.

More Telugu News