Team India: భారత జట్టును వణికించాడు.. ఎవరీ వెల్లాలగె?

  • శ్రీలంకపై 42 పరుగులతో గెలిచిన టీమిండియా
  • ఐదు వికెట్లు పడగొట్టిన యువ స్పిన్నర్ వెల్లాలగె
  • బ్యాటింగ్‌లోనూ కడదాకా ఒంటరి పోరాటం
Who is Dunith Wellalage The conqueror of Kohli Rohit in IND vs SL at Asia Cup

ఆసియా కప్‌ సూపర్‌‌4లో భాగంగా ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ భారత్ 42 పరుగుల తేడాతో శ్రీలంకపై అద్భుత విజయం సాధించింది. చిన్న టార్గెట్‌ను కాపాడుకుంటూ వరుసగా రెండో విజయంతో ఫైనల్ చేరుకుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఓడినా ఆ జట్టు యువ ఆటగాడు దునిత్‌ వెల్లాలగె హీరోగా నిలిచాడు. 20 ఏళ్ల ఆ ఆల్‌ రౌండర్ అద్భుత బౌలింగ్‌తో ఐదు వికెట్లు పడగొట్టి భారత బ్యాటింగ్ నడ్డి విరిచాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే మేటి బ్యాటర్లు అయిన రోహిత్, కోహ్లీ, రాహుల్, పాండ్యా, గిల్ గిల్‌ వికెట్లు తీసి ఔరా అనిపించాడు. అంతటితో ఆగకుండా లక్ష్య ఛేదనలో తమ అగ్ర బ్యాటర్లంతా నిరాశ పరిచిన టైమ్‌లో ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిగా పోరాడి ఇండియాను ఓడించినంత పని చేశాడు. ఈ ఒక్క మ్యాచ్‌తో క్రికెట్‌ వరల్డ్‌ దృష్టిని తనవైపునకు తిప్పుకున్నాడు. 
  
శ్రీలంక క్రికెట్‌లో మాత్రం వెల్లాలగె పేరు ఎప్పటి నుంచో మార్మోగుతోంది.  దునిత్‌ తండ్రి కూడా క్రికెటరే. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అయిన అతను ఆటలో పైస్థాయికి రాలేకపోయాడు. కానీ, తండ్రి కలను నిజం చేస్తూ దునిత్‌ స్కూల్‌ క్రికెట్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకూ అన్నింటా మెప్పిస్తున్నాడు. సహజ ప్రతిభతో స్కూల్‌ క్రికెట్‌తో వెలుగులోకి వచ్చిన అతను ఏంజెలో మాథ్యూస్‌, దిముత్‌ కరుణరత్నె, తిశార పెరీర వంటి స్టార్లను అందించిన కొలంబోలోని సెయింట్‌ జోసెఫ్‌ కాలేజ్‌ క్రికెట్‌ టీమ్‌లో చేరి తన కెరీర్‌కు బాటలు వేసుకున్నాడు. వెస్టిండీస్‌లో జరిగిన గత అండర్‌19 ప్రపంచ కప్‌ లో తొలిసారి అతని ప్రతిభ అంతర్జాతీయంగా తెలిసింది. 

ఆ టోర్నీలో అతను ఆరు మ్యాచ్‌ల్లోనే 17 వికెట్లు సాధించి టాప్ వికెట్ టేకర్‌‌గా నిలిచాడు. బ్యాటింగ్‌లో ఓ శతకం సహా 264 పరుగులు చేశాడు. దాంతో శ్రీలంక జాతీయ జట్టు నుంచి అతనికి పిలుపొచ్చింది. ఈ జూన్‌లో పల్లెకెలెలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో బరిలోకి దిగాడు. ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్‌ను ఔట్‌ చేసి తొలి అంతర్జాతీయ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు భారత సూపర్ స్టార్లు రోహిత్, కోహ్లీ,  రాహుల్, పాండ్యా, గిల్ ఐదుగురినీ ఒకే మ్యాచ్‌ లో ఔట్ చేసేశాడు. వయసుకు మించిన పరిణతితో బ్యాట్‌తోనూ మెప్పించిన ఈ ఆల్‌రౌండర్‌‌కి అద్భుత భవిష్యత్తు ఉంది.

More Telugu News