Apple iPhone 15: ఐఫోన్ 15 మోడళ్లు వచ్చేశాయి.. ధర, ఫీచర్లు చెప్పిన యాపిల్ ఆ విషయాన్ని మాత్రం దాచిపెట్టింది!

  • గత రాత్రి శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆవిష్కరణ
  • ఐఫోన్ 15న ప్రారంభ ధర భారత్‌లో రూ. 79,900
  • ఈసారి ట్రిపుల్ రియర్ కెమెరాతో ఫోన్లు
  • 1టీబీ స్టోరేజీ వరకు అందుబాటులో
  • తొలిసారి యూఎస్‌బీ సీ టైప్ చార్జర్
iPhone 15 and iPhone 15 Plus With Dynamic Island and 48 Megapixel Camera Launched in India

ప్రపంచంలోని టెక్ ప్రియులందరూ ఆసక్తి ఎదురుచూసిన ఐఫోన్ 15 మోడళ్లు వచ్చేశాయి. ‘వండర్‌లస్ట్’ పేరుతో గత రాత్రి శాన్‌ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన కార్యక్రమంలో కొత్త ఐఫోన్ 15 మోడళ్లతోపాటు యాపిల్ వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2ను యాపిల్ విడుదల చేసింది. ఈసారి ఐఫోన్ చార్జింగ్ మోడ్ విషయంలో అనూహ్య మార్పులు చేసింది. లైట్నింగ్ చార్జర్‌కు బదులు యూఎస్‌బీ సీ టైప్ చార్జింగ్‌ సదుపాయాన్ని తీసుకొచ్చింది. లైట్నింగ్ చార్జింగ్ లేకుండా వచ్చిన మొట్టమొదటి ఫోన్లు ఇవే కావడం గమనార్హం. ఒకసారి ఇతర ఫీచర్లు, ధరపైనా ఓ లుక్కేద్దాం. 

ఐఫోన్ 15, 15 ప్లస్ ధరలు ఇలా..
ఐఫోన్ 15, 15 ప్లస్ 128 జీబీ వేరియంట్ ధరలు భారత్‌లో వరుసగా రూ.79,900, రూ. 89,900 నుంచి ప్రారంభమవుతాయి. ఈ రెండూ బ్లాక్, బ్లూ, గ్రీన్, పింక్, ఎల్లో రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రొ ఆర్డర్లు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుండగా, ఐఫోన్ 15, 15 ప్లస్ అమ్మకాలు ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతాయి. ఇవి 512 జీబీ స్టోరేజీతో వస్తున్నాయి. ఐఫోన్ 15 ప్రో 128 జీబీ వేరియంట్ ధర రూ. 1,34,900తో ప్రారంభం కానుండగా, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 256 జీబీ వేరియంట్ ధర రూ. 1,59,900గా ఉంది. ఈ రెండు హ్యాండ్స్‌సెట్టు కూడా 256 జీబీ, 512 జీబీ, 1టీబీ స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఐఫోన్ 15, 15 ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు 
ఐఫోన్ 15 డ్యూయల్ సిమ్ (నానో)తో వస్తోంది. 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓలెడ్ డిస్‌ప్లే ఉపయోగించారు. ఫోన్‌కు అదనపు రక్షణ కోసం సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ ఉంది. ఐఫోన్ 14 మోడళ్లలో ఉపయోగించిన డైనమిక్ ఐలాండ్‌ ఫీచర్ ఐఫోన్ 15లోనూ ఉంది. దీని పీక్ బ్రైట్‌నెస్ 2000 నిట్స్. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఉన్నాయి. 

ఐఫోన్ 15 ప్లస్‌ 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది. గత మోడళ్లలా కాకుండా ఐఫోన్ 15, 15 ప్లస్ మోడళ్లలో 48 ఎంపీతో ప్రధాన సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా, సెల్ఫీల కోసం 12 ఎంపీ కెమెరాను ఉపయోగించారు. యాపిల్ ఐఫోన్ 15, 15 ప్లస్‌లలో ఏ16 బయోనిక్ చిప్‌సెట్ ఉపయోగించారు. అయితే ర్యామ్, బ్యాటరీ వివరాలను మాత్రం యాపిల్ వెల్లడించలేదు. త్వరలోనే ఈ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More Telugu News