S.Somanath: ఇస్రో చీఫ్ శాలరీ ఎంతో పబ్లిక్‌గా చెప్పిన పారిశ్రామికవేత్త.. నెట్టింట పెద్ద ఎత్తున చర్చ

  • ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ శాలరీ నెలకు రూ.2.5 లక్షలన్న హర్ష్ గోయెంకా
  • కానీ సోమనాథ్ డబ్బుకు మించిన సమున్నత లక్ష్యాల కోసం పనిచేస్తుంటారని వ్యాఖ్య
  • అలాంటి వ్యక్తులకు తాను తల వంచి నమస్కరిస్తానన్న గోయెంకా
  • హర్ష్ అభిప్రాయంతో ఏకీభవించిన నెటిజన్లు
  • ఇప్రో చీఫ్‌కు మరింత శాలరీ ఇవ్వాలని కొందరి వ్యాఖ్య
Harsh Goenkas post on Isro Chief S Somanaths salary triggers discussion online

ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ శాలరీ నెలకు రూ.2.5 లక్షలని ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ట్విట్టర్ వేదికగా తెలిపారు. సోమనాథ్‌కు ఇస్తున్న శాలరీ సబబేనా? న్యాయమేనా? అంటూ ఆయన వేసిన ప్రశ్నకు నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇస్రో చీఫ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూ హర్ష్ గోయెంకా ఈ ట్వీట్ చేశారు. 

‘‘ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ శాలరీ నెలకు రూ.2.5 లక్షలు. ఇది సబబేనా? న్యాయమేనా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే.. సోమనాథ్ లాంటి వ్యక్తులు డబ్బుకంటే ఉన్నతమైన విషయాలతో స్ఫూర్తి పొందుతారు. సైన్స్, పరిశోధనపై అభిరుచితో వారు ఈ రంగంలో సేవ చేస్తున్నారు. దేశప్రతిష్ఠ ఇనుమడింప చేసేందుకు పాటుపడుతున్నారు. ఇలాంటి నిబద్ధత కలిగిన వ్యక్తులకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’’ అని ట్వీట్ చేశారు. 

ఈ ట్వీట్‌కు నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. అనేక మంది హర్ష్ గోయెంకాతో ఏకీభవించారు. ఎస్. సోమనాథ్‌కు నెలకు రూ.25 లక్షలు ఇచ్చినా సరిపోదని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. అయితే, శాస్త్రవేత్తల విషయంలో ప్రభుత్వం ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటుందని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు. హర్ష్ గోయెంకా పేర్కొన్న మొత్తం బేసిక్ పే అయ్యి ఉండొచ్చని, దీనికి అదనంగా ఇతర అలవెన్సులు, సదుపాయాలు ఆయనకు అందుబాటులో వుంటాయని చెప్పుకొచ్చారు. అయితే, ఎస్. సోమ్‌నాథ్ లాంటి వారు మాత్రం డబ్బు కంటే సమున్నతమైన లక్ష్యాల కోసం పనిచేస్తుంటారని చెప్పుకొచ్చారు.

More Telugu News