Team India: ఛేదనలో చేతులెత్తేసిన లంక... ఆసియా కప్ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్

  • కొలంబోలో భారత్, శ్రీలంక మధ్య ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్
  • శ్రీలంకను 41 పరుగులతో ఓడించిన భారత్
  • నిన్న పాకిస్థాన్ పైనా భారత్ ఘనవిజయం
  • వరుసగా రెండు విజయాలతో ఫైనల్ బెర్తు ఖరారు
Team India rams into Asia Cup final by beating Sri Lanka

ఆసియా కప్ లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. నిన్న పాకిస్థాన్ పై భారీ విజయం సాధించిన భారత్... ఇవాళ శ్రీలంకతో స్వల్ప స్కోర్ల మ్యాచ్ లోనూ గెలుపొందింది. తద్వారా ఆసియా కప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 

శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన సూపర్-4 మ్యాచ్ లో తొలుత భారత్ 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే శ్రీలంక 41.3 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా భారత్ 41 పరుగుల తేడాతో ఘనంగా నెగ్గింది. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ మరోసారి మాయాజాలం చేశాడు. ఓ దశలో శ్రీలంక 99 పరుగులకే 6 వికెట్లు కోల్పోగా, వెల్లాలగే (42 నాటౌట్) అద్భుత పోరాటం కనబరిచాడు. ధనంజయ డిసిల్వా (41)తో కలిసి విలువైన భాగస్వామ్యం నమోదు చేశాడు. 

అయితే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ లంక బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేశారు. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీయగా, జడేజా 2 వికెట్లు పడగొట్టాడు. బుమ్రాకు 2, సిరాజ్ కు 1, హార్దిక్ పాండ్యాకు 1 వికెట్ దక్కాయి. 

కాగా, లంక గత 13 వన్డేల్లో ఓటమి లేకుండా వస్తోంది. ఇప్పుడా జైత్రయాత్రకు భారత్ అడ్డుకట్ట వేసింది. ఆసియా కప్ సూపర్-4 దశలో భారత్ తన తదుపరి మ్యాచ్ ను బంగ్లాదేశ్ తో ఈ నెల 15న ఆడనుంది.

More Telugu News