Balakrishna: ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతల సమావేశానికి హాజరైన బాలకృష్ణ

  • టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్
  • పార్టీ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్న బాలకృష్ణ
  • నిన్న టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నేతలతో భేటీ
  • ఇవాళ పోరంకిలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
Balakrishna attends Combined Krishna district TDP leaders meeting

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ మరింత చొరవగా పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. నిన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో బాలకృష్ణ టీడీపీ సీనియర్ నేతలతో సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించారు. 

ఇవాళ పోరంకిలో జరిగిన ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతల సమావేశానికి బాలకృష్ణ హాజరయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలతో మాట్లాడారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే టీడీపీ నేతలపై అక్రమ కేసులు మోపి వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. కేసులు పెడితే భయపడేది లేదని స్పష్టం చేశారు. నియంత పాలనపై పోరాటానికి సిద్ధంగా ఉన్నామని సమరశంఖం పూరించారు. నియంతృత్వ పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. 

ఈ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యవంతులను చేయాలని, దశల వారీగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని బాలకృష్ణ తెలిపారు. రాష్ట్ర యువతలో తీవ్ర నిరాశ నెలకొని ఉందని, ఉద్యోగాలు లేక కొందరు గంజాయికి బానిసలవుతున్న పరిస్థితి ఉందని అన్నారు. జాబ్ క్యాలెండర్ పేరుతో వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని, 2.30 లక్షల ఉద్యోగాలు ఏవని బాలయ్య నిలదీశారు.

More Telugu News