G20 Summit: అవన్నీ తప్పుదారి పట్టించే ఆరోపణలే.. జీ20 శిఖరాగ్ర సదస్సుపై కేంద్రం వివరణ

  • జీ20 సదస్సు కోసం బడ్జెట్ కేటాయింపుల కంటే 300 శాతం అదనంగా ఖర్చు చేశారని టీఎంసీ ఆరోపణ
  • సార్వత్రిక ఎన్నికల కోసం మోదీ వ్యక్తిగత ప్రతిష్ఠ పెంచేందుకే ఈ అదనపు ఖర్చని మండిపాటు
  • ఈ ఖర్చంతా బీజేపీ నుంచి రాబట్టాలన్న టీఎంసీ ప్రతినిధి గోఖలే
  • టీఎంసీ ఆరోపణలను ఖండించిన ప్రభుత్వం
  • అదనపు ఖర్చుతో శాశ్వత మౌలిక వసతులు ఏర్పాటు చేశామని వివరణ
Claims of G20 overspending misleading says government dismisses allegations

జీ20 సదస్సుకు విచ్చలవిడిగా ఖర్చు చేశారన్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. అవన్నీ తప్పుదారి పట్టించే వ్యాఖ్యలని స్పష్టం చేసింది. అధిక వ్యయాలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే ఆరోపణలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ‘ఎక్స్’ సోషల్ మీడియా వేదికగా ఖండించింది. 

‘‘జీ20 సదస్సు కోసం బడ్జెట్ కేటాయింపులకు 300 శాతం అదనంగా ప్రభుత్వం ఖర్చు చేసినట్టు ఓ ట్వీ‌ట్‌లో పేర్కొన్న అంశం అవాస్తవం. అది తప్పుదారి పట్టించేదే. అందులో పేర్కొన్న నిధులు ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ద్వారా శాశ్వత ఆస్తులు, ఇతర మౌలిక వసతుల కల్పన కోసమే. కేవలం జీ20 సదస్సు కోసం కాదు’’ అని పీఐబీ ట్వీట్ చేసింది. 

జీ20 సదస్సుకైన ఖర్చు గురించి తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి గోఖలే సంచలన ఆరోపణలు చేశారు. గత కేంద్ర బడ్జెట్‌లో ఈ సదస్సు కోసం రూ.990 కోట్లు కేటాయించారని, కానీ వాస్తవానికి ప్రభుత్వం రూ.4100 కోట్లు ఖర్చుపెట్టిందని అన్నారు. ‘‘ఇది బడ్జెట్ కేటాయింపుల కంటే 300 శాతం ఎక్కువ’’ అని వ్యాఖ్యానించారు. 

‘‘2024 ఎన్నికలే లక్ష్యంగా మోదీ వ్యక్తిగత ప్రచారం కోసం ఇదంతా ఖర్చు చేశారు కాబట్టి ఈ నిధులను బీజేపీ నుంచే ఎందుకు రాబట్టకూడదు’’ అని గోఖలే ప్రశ్నించారు.

More Telugu News