RTS Bus stolen: సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ బస్సు చోరీ.. డ్రైవర్‌ అవతారమెత్తిన దొంగ.. ప్రయాణికులు టిక్కెట్లకు ఇచ్చిన డబ్బుతో పరార్!

Thief drives away with RTC bus collects money from unsuspecting passengers in siricilla
  • బస్సును ఎంపీడీవో కార్యాలయం వద్ద నిలిపి తాళం వేయకుండా వెళ్లిన డ్రైవర్
  • బస్సు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయిన దొంగ
  • దారిలో ప్రయాణికులను ఎక్కించుకుని టికెట్ల పేరిట డబ్బులు వసూలు
  • మధ్యలో డీజిల్ అయిపోవడంతో తెస్తానని చెప్పి నిందితుడి పరార్
  • అదే మార్గంలో వెళుతున్న ఆర్టీసీ డ్రైవర్లకు అనుమానం వచ్చి కార్యాలయానికి సమాచారం 
ఆర్టీసీ బస్సును చోరీ చేసిన ఓ దొంగ డ్రైవర్‌గా నటిస్తూ ప్రయాణికుల నుంచి టిక్కెట్ల పేరిట డబ్బులు వసూలు చేసి పారిపోయాడు. సిరిసిల్ల జిల్లాలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే, జిల్లాకు చెందిన స్వామి తన బస్సును ఆర్టీసీలో అద్దెకు నడిపిస్తున్నారు. కాగా, ఆదివారం రాత్రి బస్సు డ్రైవర్ ఎంపీడీవో కార్యాలయం వద్ద దాన్ని పార్క్‌ చేసి తాళం వేయకుండానే వెళ్లిపోయారు. 

ఇదే అదనుగా జిల్లాలోని గంభీరావు పేట మండలం శ్రీగాదకు చెందిన బందెల రాజు బస్సును దొంగిలించి డ్రైవ్ చేస్తూ వేములవాడకు బయలుదేరాడు. మార్గమధ్యంలో కొందరు ప్రయాణికులను ఎక్కించుకుని వారి వద్ద టిక్కెట్ల పేరిట డబ్బులు కూడా వసూలు చేశాడు. టిక్కెట్లు మాత్రం తరువాత ఇస్తానని అన్నాడు. ఆర్టీసీ బస్సు కావడంతో ప్రయాణికులు అతడి తీరును అనుమానించలేదు. ఈ లోపు సారంపల్లి-నేరెళ్ల మార్గంలో బస్సు తంగళపల్లి వద్ద ఆగిపోయింది. దీంతో, డీజిల్ అయిపోయిందని, తీసుకొస్తానని చెప్పిన దొంగ పరారయ్యాడు. 

అటుగా వెళుతున్న ఇతర ఆర్టీసీ బస్సు డ్రైవర్లు రోడ్డు మీద ఆగున్న బస్సును గమనించి కంట్రోలర్‌కు సమాచారం అందించారు. ఈ విషయాన్ని కంట్రోలర్ బస్సు యజమానికి సమాచారం ఇవ్వగా ఆయన వెళ్లి బస్సును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, సిద్దిపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడు రాజును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
RTS Bus stolen
Rajanna Sircilla District
Telangana

More Telugu News