Team India: కేఎల్ రాహుల్, కోహ్లీ సెంచరీల మోత... పాకిస్థాన్ కు భారీ టార్గెట్ నిర్దేశించిన భారత్

  • ఆసియా కప్ లో భారత్, పాకిస్థాన్ మధ్య సూపర్-4 మ్యాచ్
  • నిన్న వర్షంతో నిలిచిపోయిన మ్యాచ్
  • నేడు రిజర్వ్ డేలో ఆట కొనసాగింపు
  • 50 ఓవర్లలో 2 వికెట్లకు 356 పరుగులు చేసిన భారత్
  • ఇవాళ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన పాక్
  • కొలంబోలో పరుగుల ప్రవాహం సృష్టించిన కోహ్లీ, రాహుల్
Team India set Pakistan huge target with Kohli and Rahul centuries

ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్ లో పాకిస్థాన్ పై భారత బ్యాటర్లు దంచికొట్టారు. ఇవాళ శ్రీలంక రాజధాని కొలంబోలో రిజర్వ్ డేలో జరిగిన మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ కొనసాగించింది. గాయం నుంచి కోలుకుని సుదీర్ఘ విరామం తర్వాత మ్యాచ్ ఆడుతున్న కేఎల్ రాహుల్ సెంచరీతో సత్తా చాటగా, మాజీ సారథి విరాట్ కోహ్లీ తనదైన శైలిలో మరో సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. వీరిద్దరి సెంచరీల మోతతో పాక్ బౌలర్లు కుదేలయ్యారు. 

నిన్న వర్షం వల్ల మ్యాచ్ నిలిచిపోగా, అప్పటికి భారత్ 24.1 ఓవర్లలో 2 వికెట్లకు 147 పరుగులు చేసింది. కోహ్లీ, కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్నారు. అదే స్కోరుతో ఇవాళ రిజర్వ్ డేలో ఆట కొనసాగించిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లకు 356 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. 

కోహ్లీ 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో 122 పరుగులు... కేఎల్ రాహుల్ 106 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సులతో 111 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. వీళ్లిద్దరినీ అవుట్ చేయడం పాక్ బౌలర్ల వల్ల కాలేదు. 

అంతేకాదు, ఈ మ్యాచ్ లో కోహ్లీ-రాహుల్ జోడీ మూడో వికెట్ కు అజేయంగా 233 పరుగులు జోడించారు. వన్డేల్లో పాకిస్థాన్ పై భారత్ కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. 

అటు, కోహ్లీ వన్డేల్లో 13 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. అతి తక్కువ మ్యాచ్ ల్లో 13 వేల పరుగులు సాధించిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కోహ్లీకి ఈ ఘనతను 267 మ్యాచ్ ల్లో అందుకున్నాడు.

More Telugu News