Chandrababu: చంద్రబాబుపై మరో కేసు.. విచారణకు అనుమతి కోరనున్న సీఐడీ

  • అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి 2022లో కేసు నమోదు
  • ఈ కేసులో చంద్రబాబు విచారణకు అనుమతి కోరుతూ సీఐడీ పీటీ వారెంట్ వేసే అవకాశం
  • చంద్రబాబు హౌస్ అరెస్ట్‌పై కౌంటర్ సిద్ధం చేసిన సీఐడీ
Another case on TDP chief Chandrababu Naidu

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై మరో కేసు నమోదైంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ చంద్రబాబును విచారించడానికి అనుమతి కోరుతూ సీఐడీ పీటీ వారెంట్ వేయనుందని తెలుస్తోంది. ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి సీఐడీ పోలీసులు 2022లో కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో ఇది వరకే వాదనలు పూర్తయ్యాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఈ క్రమంలో తాజాగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టై రాజమండ్రి జైల్లో ఉంటున్నారు. కాబట్టి ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ మాజీ సీఎంను విచారించేందుకు అనుమతి కోరనున్నారని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, చంద్రబాబు హౌస్ ‌రిమాండ్ కు అవకాశమివ్వాలన్న పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ పిటిషన్‌పై లంచ్ సమయంలోపు కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి... సీఐడీని ఆదేశించారు. మధ్యాహ్నం తర్వాత ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేశారు.

చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌పై సీఐడీ కౌంటర్‌ను సిద్ధం చేసింది. మాజీ సీఎం భద్రతకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని, రాజమండ్రి సెంట్రల్ జైలులో బెస్ట్ సెక్యూరిటీ ఉంటుందని, చంద్రబాబును అక్కడ ఉంచడమే మంచిదని సీఐడీ... కోర్టు దృష్టికి తీసుకు వెళ్ళేందుకు కౌంటర్ పిటిషన్ సిద్ధం చేసింది.

More Telugu News