Lakshmi Parvati: చంద్రబాబు జైలుకు వెళ్లిన ఆనందం.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీపార్వతి నివాళి

Lakshni Parvathi pays tributes at NTR ghat
  • 74వ ఏట ఎన్టీఆర్ ను చంద్రబాబు అవమానించారన్న లక్ష్మీపార్వతి
  • అదే 74వ ఏట చంద్రబాబు క్షోభను అనుభవిస్తున్నారని ఎద్దేవా
  • ఇన్నేళ్లు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చారని విమర్శ

టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లడంలో వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి చాలా సంతోషంగా ఉన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆమె నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు అవినీతిపరుడనే విషయం ఏసీబీ కోర్టు తీర్పుతో ప్రజలందరికీ తెలిసిందని చెప్పారు. 74వ ఏట ఎన్టీఆర్ ను ఘోరంగా అవమానించిన చంద్రబాబు.. చాలా విచిత్రంగా ఆయన 74వ ఏట క్షోభను అనుభవించాల్సి వచ్చిందని అన్నారు. ఇన్నేళ్లు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చిన చంద్రబాబు... ఇప్పుడు శిక్షను అనుభవిస్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ ను హింసించిన పాపం ఇప్పుడు పండిందని అన్నారు. 

మరోవైపు, ఇటీవల ఎన్టీఆర్ స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ వెళ్లారు. తాను ఎన్టీఆర్ భార్య అని, తనను కూడా కార్యక్రమానికి ఆహ్వానించాలని రాష్ట్రపతికి లక్ష్మీపార్వతి లేఖ రాశారు. అయినప్పటికీ రాష్ట్రపతి భవన్ నుంచి ఆమెకు ఎలాంటి స్పందన రాలేదు.

  • Loading...

More Telugu News