Daggubati Purandeswari: టీడీపీ బంద్ కు బీజేపీ మద్దతు ఇస్తున్నట్టు తప్పుడు ప్రచారం... సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్న పురందేశ్వరి

  • స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్
  • చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా సెప్టెంబరు 11న టీడీపీ బంద్
  • పురందేశ్వరి పేరిట ఫేక్ లెటర్ తో ప్రచారం
  • ఖండించిన పురందేశ్వరి
Purandeswari condemns fake letter

చంద్రబాబునాయుడ్ని స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో సీఐడీ అరెస్ట్ చేసినందుకు నిరసనగా రేపు (సెప్టెంబరు 11) టీడీపీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే రేపటి టీడీపీ బంద్ కు ఏపీ బీజేపీ మద్దతు ఇస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి పేరిట ఓ ప్రకటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

దీనిపై దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. అది ఫేక్ అని స్పష్టం చేశారు. టీడీపీ పార్టీ ఇచ్చిన రేపటి బంద్ పిలుపునకు మద్దతు ఇచ్చినట్టుగా... బీజేపీ లెటర్ హెడ్ పై నా సంతకంతో ఒక ఫేక్ లెటర్ వాట్సాప్ గ్రూపులలో సర్క్యులేట్ అవుతోందని వెల్లడించారు. ఈ ఫేక్ లెటర్ వ్యాప్తికి కారకులపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాం అని తెలిపారు. 

అటు, టీడీపీ బంద్ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని జనసేన పార్టీ  నిర్ణయించింది. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా టీడీపీ చేపట్టిన బంద్ కు జనసేన సంఘీభావం ప్రకటిస్తోందని జనసేనాని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రజల పక్షాన ఎలుగెత్తే విపక్షాలను రాజకీయ కక్ష సాధింపుతో, కేసులతో, అరెస్టులతో వేధిస్తోందని అధికార వైసీపీపై పవన్ మండిపడ్డారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు జనసేన ఎప్పుడూ వ్యతిరేకమని స్పష్టం చేశారు. రేపటి బంద్ లో జనసేన శ్రేణులు శాంతియుతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

More Telugu News