Pawan Kalyan: చంద్రబాబుని టార్చర్ పెట్టారు.. రేపటి నుంచి మేమేందో మీకు చూపిస్తాం: పవన్ కల్యాణ్

Pawan Kalyan warning to YSRCP after Chandrababu remand
  • ప్రతిష్ఠాత్మకమైన జీ20 సమ్మిట్ ను జగన్ నాశనం చేశాడన్న పవన్
  • ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని వ్యాఖ్య
  • మన ఓటు శాతం బాగా పెరిగిందన్న పవన్
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. దేశంలో జీ20 సమావేశాలు జరుగుతున్న సమయంలో... ఏపీ ముఖ్యమంత్రి జగన్ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత కీలకమైన సమ్మిట్ జరుగుతున్న సమయంలో... ఈ వ్యక్తి జగన్ మొత్తం నాశనం చేశారని చెప్పారు. జగన్ కోసం కేంద్రం ఎంతో చేస్తే... కేంద్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జీ20ని జగన్ చంపేశారని అన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

వివేకానందరెడ్డి హత్య కేసులో అన్ని వ్యవస్థలను జగన్ చంపేశాడని, వివేకాను చంపేసిన వ్యక్తి బయట తిరుగుతున్నాడని మండిపడ్డారు. ఎంతో ప్రజాదరణ ఉన్న తనను, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును రోడ్ల మీద తిరగనీయకుండా ఆపేస్తున్నారంటే... ఈ విషయంపై రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలని చెప్పారు. రాష్ట్ర పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం మార్చేసిందని మండిపడ్డారు. మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్... అదే మద్యాన్ని వ్యాపారంగా మార్చుకున్నారని దుయ్యబట్టారు. 

కోర్టులు ఎక్కడ పని చేస్తున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వాళ్లు యుద్ధం కోరుకుంటున్నారని... మేము వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు. నువ్వు మర్డర్లు చేసి, దారి దోపిడీలు చేసిన వారిని కాపాడుతూ, ఇసుకను దోచేస్తున్న వారికి అండగా ఉన్న నీకు మేము భయపడమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరు చేస్తున్న అక్రమ వ్యాపారాల వల్ల రాష్ట్రంలో ఎంతో పొల్యూషన్ వస్తోందని మండిపడ్డారు. 

ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నాడని విమర్శించారు. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయని... రాష్ట్ర ప్రజలు వీటి గురించి ఆలోచించాలని చెప్పారు. పనికిమాలిన ప్రభుత్వం గురించి మాట్లాడటం ప్రజాస్వామ్యంలో అందరికీ ఉన్న హక్కు అని అన్నారు. మనకు ఓటు శాతం చాలా బలంగా పెరిగిందని, ఎంత శాతం పెరిగిందనేదాని గురించి ఇప్పుడు మాట్లాడనని చెప్పారు. రాష్ట్రంలో అందరికీ పిరికితనం ఆవహించిందని అసహనం వ్యక్తం చేశారు. ఎంతకాలం పిరికిగా బతుకుతామని ప్రశ్నించారు. సొంత చిన్నాన్నను చంపిన చరిత్ర వీరిదని మండిపడ్డారు. 

తాను బతికి ఉన్నంత కాలం రాష్ట్రం కోసం పోరాడుతూనే ఉంటానని చెప్పారు. చంద్రబాబుకు తాను పూర్తి మద్దతును ప్రకటిస్తున్నానని అన్నారు. చంద్రబాబుని టార్చర్ పెట్టారని... మిమ్మల్ని నేను వదులుతానని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. రేపటి నుంచి మేమేందో మీకు చూపిస్తామని హెచ్చరించారు.
Pawan Kalyan
janasena
Chandrababu
Telugudesam
Jagan
YSRCP

More Telugu News