Pawan Kalyan: క్రిమినల్ కి అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది: పవన్ కల్యాణ్

If a criminal is empowered it will be like this says Pawan Kalyan
  • ఏపీకి రావడానికి రాష్ట్ర ప్రభుత్వం వీసా కావాలి అంటుందేమోనని ప్రశ్న
  • చంద్రబాబును అరెస్ట్ చేస్తారని తాము ముందుగా ఊహించలేదన్న పవన్
  • వారాహి యాత్ర తదుపరి షెడ్యూల్ కోసం ప్లాన్ చేసుకున్నామన్న జనసేన అధినేత
క్రిమినల్‌కు అధికారం ఇస్తే ఇలాగే ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. నిన్న విజయవాడ వచ్చిన పవన్‌ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకు కొద్దిసేపటి ముందు పవన్ అనుమంచిపల్లి దగ్గర మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేస్తారని మేమేమీ ముందుగా ఊహించలేదు. వారాహి యాత్ర తదుపరి షెడ్యూల్ కోసం మేము రేపు (శనివారం) ఓ కార్యక్రమానికి ప్లాన్ చేసుకున్నాం. నన్ను ఆపితే పోలీసులకి ఒకటే చెప్పా. బెయిల్ మీద ఈ ముఖ్యమంత్రి బయట ఉన్నాడు. ఎంతసేపూ ఆ ముఖ్యమంత్రి జైలు గురించే ఆలోచిస్తాడు. అందర్నీ జైలుకి పంపాలనే ఆలోచిస్తాడు. అతనో క్రిమినల్. విదేశాలకు వెళ్లాలన్నా కోర్టు అనుమతి తీసుకోవాలి. అలాంటి వాడి చేతిలో అధికారం ఉంది అది దురదృష్టం. బెయిల్ మీద బయటకెళ్లే వాడికి ఎంతసేపూ అరెస్టులు చేయాలనే ఆలోచనలే ఉంటాయి. తను క్రిమినల్ అయితే అందరూ క్రిమినల్స్ అవ్వాలని కోరుకుంటాడు. అదీ సమస్య. చంద్రబాబు నాయుడి గారిని కలుస్తానని ఎలా ఊహిస్తారు. కోర్టు ప్రాంగణంలోకి వెళ్లడానికి ఎవరు అనుమతిస్తారు’ అని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రావడానికి వీసా కావాలి అని రాష్ట్ర ప్రభుత్వం అంటుందేమో? అని పవన్ ఎద్దేవా చేశారు. ‘రౌడీలు, గూండాలకు అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది. ట్రాఫిక్ అగిపోయింది. చాలా మంది బాధ పడుతున్నారు. ఫ్లయిట్ లో వెళ్తానంటే ఎక్కనివ్వలేదు. కారులో వెళ్తామంటే అనుమతివ్వడం లేదు. నడిచి వెళ్తామన్నా అనుమతి ఇవ్వడం లేదు. విశాఖలో కూడా ఇలాగే చేశారు. ఏం చేయాలి. గూండాలు, దోపిడీ చేసే వారికి అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది. అది అందరికీ అర్థం అవుతోంది. ఒకపక్క జాతీయ స్థాయిలో జీ20 సమ్మిట్ జరుగుతోంది. జీ20 దేశాల ప్రతినిధులు వస్తున్నప్పుడు ఇలాంటి పని చేయడం ప్రధానమంత్రిగారి స్ఫూర్తికి మచ్చ. ప్రధానమంత్రి చాలా కష్టపడి జీ20 సమావేశాలను మన దేశానికి తీసుకొచ్చినప్పుడు, అన్ని రాష్ట్రాలు సహకరించాలి. దురదృష్టం ఏమిటంటే... గూండాలకి అధికారం ఇస్తే జీ20 తాలూకు విశిష్టత వారికి ఏమర్ధమవుతుంది? పోలీసులు కోఆపరేట్ చేయమని నన్ను ఆపేశారు తప్ప, ఏమీ చెప్పలేదు’ అని పవన్ అన్నారు.
Pawan Kalyan
YS Jagan
Chandrababu
Andhra Pradesh

More Telugu News