Chandrababu Arrest: ఏసీబీ కోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన చంద్రబాబు

  • వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని న్యాయమూర్తిని కోరిన చంద్రబాబు
  • అంగీకరించిన న్యాయమూర్తి
  • స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రభుత్వ నిర్ణయమన్న బాబు
  • కేబినెట్ నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు తీసుకోలేరని స్పష్టీకరణ
  • రాజకీయ కక్షతోనే తనను అరెస్ట్ చేశారన్న టీడీపీ అధినేత
TDP Chief Chandrababu himself arguing in skill development case

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏసీబీ కోర్టులో స్వయంగా తన వాదనలు వినిపించారు. వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు కోరగా, అందుకు న్యాయమూర్తి అవకాశం ఇచ్చారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన అరెస్ట్ అక్రమమని, రాజకీయ కక్షతోనే తనను అరెస్ట్ చేశారని వాదించారు. 

స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు కేబినెట్ నిర్ణయమని, ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు ఎలా తీసుకుంటారని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. 2015-16 బడ్జెట్‌లోనే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ను చేర్చామని, అసెంబ్లీ కూడా అందుకు ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్ కేటాయింపును క్రిమినల్ చర్యలతో ప్రశ్నించలేరని అన్నారు. 

9 డిసెంబర్ 2021 నాటి ఎఫ్ఐఆర్‌లో తన పేరు లేదని, అప్పటి రిమాండ్ రిపోర్టులోనూ సీఐడీ తన పేరును ప్రస్తావించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్ అనుమతి లేకుండానే తనను అరెస్ట్ చేశారంటూ చంద్రబాబు తన వాదనలు వినిపించారు.

More Telugu News