ఇంట్రెస్టింగ్ గా 'ఆఖరి సచ్' ఫోర్త్ ఎపిసోడ్ .. క్లూ దొరికేసింది!
- క్రితం నెల 25న మొదలైన 'ఆఖరి సచ్'
- అసలు కథకు తోడవుతున్న తమన్నా ఫ్లాష్ బ్యాక్
- హత్యకేసుకి సంబంధించిన కీలకమైన ఎపిసోడ్ ఇది
- రానున్న ఎపిసోడ్స్ పై పెరుగుతున్న ఆసక్తి
ఈ ఎపిసోడ్ లో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా తమన్నాలోని రెండు కోణాలను ఆవిష్కరించారు. తాను నమ్మిన వ్యక్తి తనని మోసం చేయడాన్ని తట్టుకోలేక ఆమె తల్లడిల్లిపోవడం. అలాగే ఒక బాలిక నీళ్లలో మునిగిపోతున్నట్టుగా ఆమెకి తరచూ ఒక కల వస్తూ ఉండటం. ఆ సమయంలో తాను కూడా తన శరీరాన్ని వదిలేసినట్టుగా ఆమె కంగారుపడుతూ ఉంటుంది. ఇదంతా చూస్తుంటే, తమన్నా వెనుక ఒక బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉందనే విషయం అర్థమవుతోంది.
ఇక 11మంది కుటుంబ సభ్యులు ఒక్కసారిగా చనిపోవడమనే కేసులో, తమన్నాకి పై అధికారుల నుంచి ఒత్తిడి ఎదురవుతుంది. ఆ కేసును వదిలేద్దామని ఆమె అనుకుంటూ ఉండగా, ఒక విషయం గుర్తుకు వస్తుంది. గతంలో ఆ ఫ్యామిలీ నివసించిన ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. ఆ రాత్రే ఆమె తన టీమ్ తో భువన్ ఇంటికి చేరుకుంటుంది. అక్కడ ఆమెకి ఒక కీలకమైన ఆధారం దొరుకుతుంది. అదేమిటి? వాటి ఆధారంగా ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది మిగతా ఎపిసోడ్స్ పై ఉత్కంఠను పెంచుతోంది.