Chandrababu: చంద్రబాబు అరెస్ట్‌ వార్తను మీడియా ద్వారానే తెలుసుకున్న గవర్నర్

  • కనీస సమాచారం లేకపోవడంపై గవర్నర్ విస్మయం వ్యక్తం చేసినట్టు సమాచారం 
  • అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి అంటున్న నిపుణులు 
  • 2021లో కేసు నమోదు చేసినప్పటి నుండి అనుమతి తీసుకోని వైనం
AP governor response on Chandrababu Naidu arrest

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ విస్మయం వ్యక్తం చేసినట్టు సమాచారం. తనకు కనీస సమాచారం ఇవ్వకపోవడంపై గవర్నర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడానికి గవర్నర్ కార్యాలయాన్ని సీఐడీ అధికారులు సంప్రదించలేదని తెలుస్తోంది. అవినీతి నిరోధక చట్టం-2018 సవరణల ప్రకారం ప్రజాప్రతినిధులు, అంతకుముందు మంత్రులుగా పని చేసినవారు నిర్వహించిన శాఖల్లో అవినీతి జరిగినట్లుగా ప్రభుత్వం దృష్టికి వస్తే వాటిని క్రోడీకరించి గవర్నర్‌కు నివేదికను సమర్పించాలని, ఆ తర్వాత గవర్నర్ నుంచి అనుమతి తీసుకొని విచారణ చేపట్టాలని న్యాయ నిపుణులు అంటున్నారు. 

అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ(సీ) ప్రకారం గవర్నర్ అనుమతి తప్పనిసరి. కానీ 2021లో కేసు నమోదు చేసినప్పటి నుండి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలుస్తోంది. గవర్నర్ కూడా మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగానే అరెస్టు గురించి తెలుసుకున్నారని తెలుస్తోంది. దీంతో మాజీ సీఎం అరెస్ట్‌పై ఆయన విస్మయం వ్యక్తం చేసినట్టు సమాచారం. 

More Telugu News