Chandrababu: సిట్ కార్యాలయానికి చంద్రబాబు కాన్వాయ్.. కలిసేందుకు పవన్ కల్యాణ్‌కు అనుమతి నిరాకరణ!

  • చంద్రబాబును కలిసేందుకు కుటుంబ సభ్యులకు మినహా ఎవరికీ అనుమతి లేదన్న పోలీసులు
  • టీడీపీ కార్యకర్తల అడ్డగింత మధ్య తాడేపల్లి సిట్ కార్యాలయానికి టీడీపీ అధినేత కాన్వాయ్
  • మంగళగిరిలో పలుచోట్ల అడ్డుకున్న టీడీపీ కేడర్
Police rejected pawan kalyan meeting with Chandrababu

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును కలిసేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు పోలీసులు అనుమతిని నిరాకరించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి, చంద్రబాబును కలవాలని జనసేనాని భావించారు. కానీ ఆయనను కలిసేందుకు కుటుంబ సభ్యులు మినహా ఎవరికీ అనుమతిలేదని పోలీసులు స్పష్టం చేశారు. 

విజయవాడలో శాంతిభద్రతల సమస్య ఉందని చెబుతూ పోలీసులు జనసేనానికి మెయిల్ పంపించారు. దీంతో పర్యటన రద్దు చేసుకున్నట్లు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. బేగంపేట విమానాశ్రయంలోనే పవన్‌ను నిలిపివేశారు. దీంతో బేగంపేట నుండి పవన్ కాన్వాయ్ వెనుదిరిగింది. ప్రత్యేక విమానం కోసం డీజీసీఏ నుండి జనసేన ముందే అనుమతి తీసుకుంది. కానీ పోలీసులు అనుమతి నిరాకరించారు.

చంద్రబాబును తీసుకెళ్తున్న కాన్వాయ్‌ను టీడీపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. చిలకలూరిపేట మొదలు ప్రతిచోట టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయిస్తూ నిరసన తెలుపుతున్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయం, ఆ తర్వాత జనసేన కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య చంద్రబాబు కాన్వాయ్ తాడేపల్లి సిట్ కార్యాలయానికి చేరుకుంది.

More Telugu News