Narendra Modi: మోదీ, బైడెన్ ద్వైపాక్షిక సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలివే..!

  • ఏఐ, సైన్స్, డిఫెన్స్ రంగాలపై చర్చ
  • ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యునిగా భారత్ కు తమ మద్దతు ఉంటుందని బైడెన్ పునరుద్ఘాటన
  • తమ భేటీ అర్థవంతంగా సాగిందన్న ప్రధాని మోదీ
 What PM Modi  President Biden discussed in bilateral meet

జీ20 సమావేశాల కోసం న్యూఢిల్లీ చేరుకున్న తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేరుగా ప్రధానమంత్రి మోదీ నివాసానికి వెళ్లారు. అక్కడ అమెరికా అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికిన ప్రధాని మోదీ ఆయనతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. దాదాపు 50 నిమిషాల పాటు కొనసాగిన ఈ భేటీలో ఇరువురు నేతలు కీలక అంశాలపై చర్చించారు. భారత్ - అమెరికా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేలా వీరి మధ్య చర్చలు జరిగినట్లుగా ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో కృత్రిమ మేధ (ఏఐ), 5జీ, 6జీ స్పెక్ట్రమ్, ఉక్రెయిన్ అంశం, పౌర అణు రంగంలో పురోగతి, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత అంశాలపై కూడా చర్చ జరిగింది. భేటీ తర్వాత ఇరు దేశాలు ఉమ్మడి ప్రకటన చేశాయి. 

2023 జూన్‌లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాలను అమలు చేయడంలో గణనీయమైన పురోగతిని ప్రధాని మోదీ, బైడెన్ అభినందించారు. 2024లో జరిగే తదుపరి క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం సిద్ధమవుతుండగా, క్వాడ్ ప్రాముఖ్యతను ఇరువురు నాయకులు ధ్రువీకరించారు. ఇండో-పసిఫిక్‌కు సహ-నాయకత్వం వహించే అమెరికా నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యునిగా భారత్ కు తమ మద్దతు ఉంటుందని అధ్యక్షుడు బైడెన్ పునరుద్ఘాటించారు.  

అమెరికా అధ్యక్షుడితో భేటీ తర్వాత ప్రధాని మోదీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ‘అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు స్వాగతం పలకడం ఆనందంగా ఉంది. మా సమావేశం చాలా అర్థవంతంగా జరిగింది. మేం భారత్, అమెరికా మధ్య ఆర్థిక సంబంధాలకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించాం. మేం ప్రజల మధ్య సంబంధాలను ముందుకు తీసుకువెళ్తాం. మన దేశాల మధ్య స్నేహం ప్రపంచ పురోగతిలో గొప్ప పాత్ర పోషిస్తుంది’ అని పేర్కొన్నారు.

More Telugu News