Raghu Rama Krishna Raju: చంద్రబాబుపై చేయి చేసుకునే ధైర్యం ఎవరికీ ఉండదు... ఆ సంగతి నాకు తెలుసు: రఘురామకృష్ణరాజు

  • స్కిల్ డెవలప్ మెంట్ స్కాం ఆరోపణలపై చంద్రబాబు అరెస్ట్
  • ఈ మూర్ఖుడు ఎంత పనిచేశాడంటూ రఘురామ స్పందన
  • ఈ కేసులో విషయం లేదని కామెంట్  
  • చంద్రబాబు ఈ సాయంత్రం లోపు బయటికి వచ్చేస్తాడని వ్యాఖ్యలు
Raghurama opines on Chandrababu arrest

నంద్యాలలో టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేయడం తెలిసిందే. దీనిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. ఈ మూర్ఖుడు ఎంత పనిచేశాడు? అంటూ సీఎం జగన్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 

"ఓవైపు జీ20 సదస్సు జరుగుతోంది... ప్రపంచ దేశాధినేతలు మనదేశానికి వచ్చారు... ఇలాంటి వేళ ఒక మహోన్నత శిఖరం వంటి చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఎన్నికలు వస్తున్నాయి... ఏదో ఒక కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయాలన్న కోరికతోనే ఈ విధంగా వ్యవహరించినట్టుంది. 

ఈ కేసులో విషయం లేదు... గతంలో నేను బయటికి వచ్చినట్టుగానే చంద్రబాబు ఈ మధ్యాహ్నానికో, సాయంత్రానికో, లేక 24 గంటల లోపు బయటికి వచ్చేస్తారు. ఇవాళ రెండో శనివారం, రేపు ఆదివారం కావడంతో చంద్రబాబు న్యాయవాదులు హౌస్ మోషన్ పిటిషన్ వేయాల్సి ఉంటుంది, లేకపోతే నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చు. ఇలాంటి పెట్టీ కేసుతో చంద్రబాబును అరెస్ట్ చేసి ఏం చేయాలనుకుంటున్నారు?

ఈ ముఖ్యమంత్రి చెత్తవాడని తెలుసు కానీ, ఈ స్థాయికి దిగజారతాడని మాత్రం ఊహించలేదు. వైసీపీ సభ్యుడిగా చెబుతున్నా... కోపం ఉండొచ్చు... ఇంకేమైనా ఉండొచ్చు... కానీ ఎన్నికల సమయంలో ఇంత పిచ్చి పనిచేస్తారా? బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఇలా చేస్తాడా? పార్టీని సర్వనాశనం చేయడానికి ఇలాంటి పనికిమాలినవాడు ఒకడు అధ్యక్షుడుగా ఉంటే చాలనిపిస్తోంది. 

ఇవాళ్టితో యువజన శ్రామిక రైతు పార్టీ అనేదాన్ని జగన్ కూకటివేళ్లతో సహా పెకలించివేశాడు. ఈ అరెస్ట్ తో నా ప్రస్తుత పార్టీ పీడ విరగడ అవుతుంది... ఇక రాష్ట్రానికి మహర్దశ మొదలు కానుంది. 

అయితే, గతంలో నన్ను కొట్టారు... ఇప్పుడు చంద్రబాబుపై చేయి వేసేంత ధైర్యం ఎవరికీ ఉండదని నాకు తెలుసు. కానీ ఈ వెధవలు ఆయనతో తప్పుగా వ్యవహరించినా, అనుచితంగా ప్రవర్తించినా రాష్ట్రం తగలబడిపోయే అవకాశాలున్నాయి. దేశానికి ఇది ఎంతో అప్రదిష్ఠ కలిగించే అంశం. 

ప్రధాని మోదీ తదితరులు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, సంబంధిత మంత్రిత్వ శాఖకు ఎలాంటి సమాచారం లేకుండా ఈ అరెస్ట్ కు ఒడిగట్టడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించే అవకాశాలున్నాయి. కేంద్రం ఇతడ్ని ఉపేక్షిస్తుందని నేను అనుకోవడంలేదు" అని రఘురామ తన అభిప్రాయాలను పంచుకున్నారు.

More Telugu News