E-bike: పెట్రోల్ బైక్ కొనేందుకు డబ్బుల్లేక ఈ-బైక్ తయారు చేసుకున్న యువకుడు

  • డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న బెంగాలీ యువకుడి అద్భుత ఆవిష్కరణ
  • డబ్బుల్లేక బైక్ కొనుక్కోలేక పోయిన యువకుడు
  • సొంతంగా ఈ-బైక్ తయారు చేసుకున్న వైనం
  • 40 నిమిషాల్లో బైక్ ఛార్జింగ్ పూర్తి  
  • బైక్ చోరీని అడ్డుకునేలా కట్టుదిట్టమైన ఏర్పాటు
Not able afford new bike this bengali youth made e bike on his own

అవసరమే ఆవిష్కరణలకు పురుడు పోస్తుందంటారు. ఇందుకు తాజా ఉదాహరణే ఈ బెంగాలీ యువకుడు. కోల్‌కతాకు చెందిన సుబ్రజ్యోతి రాయ్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇతర యువకుల్లాగే తనకూ ఓ బైక్ ఉండాలనేది అతడి కోరిక. అతడి తల్లిదండ్రులకు కూడా కుమారుడికి బైక్ కొనాలని ఉండేది కాదు, అంత ఖర్చు భరించే స్థోమత వారికి లేదు. 

దీంతో, సుబ్రజ్యోతి స్వయంగా రంగంలోకి దిగి తన బైక్ తానే తయారు చేసుకున్నాడు. పెట్రోల్ బైక్‌కు బదులు పర్యావరణహితమైన ఈ-బైక్ వైపు మొగ్గు చూపాడు. నగరంలోని ఆటోమొబైల్ మార్కెట్ నుంచి వివిధ విడిభాగాలు కొనితెచ్చుకున్న అతడు వాటితో ఈ-బైక్ తనకు నచ్చినట్టు తయారు చేసుకున్నాడు. కేవలం 40 నిమిషాల్లోనే దీని చార్జింగ్ పూర్తి చేయవచ్చని, బైక్ నడిపే సమయంలో ఏమాత్రం శబ్దం రాదని చెప్పుకొచ్చాడు. బైక్‌ భద్రత విషయంలోనూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశానని, ఇందులో అమర్చిన పరికరాల కారణంగా ఎవరైనా బైక్ చోరీకి ప్రయత్నిస్తే ఇట్టే తెలిసిపోతుందని వివరించాడు సుబ్రజ్యోతి రాయ్.

More Telugu News