Bypolls: బీజేపీకి 3, విపక్షాలకు 4... ఉప ఎన్నికల ఫలితాల వెల్లడి

  • ఈ నెల 5న ఆరు రాష్ట్రాల్లోని 7 నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్
  • నేడు ఓట్ల లెక్కింపు
  • ఇండియా కూటమి ఏర్పడ్డాక విపక్షాలకు గణనీయ విజయం
Opposition parties won 4 and BJP claims 3 seats in Bypolls

దేశంలోని 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలు ఈ నెల 5న నిర్వహించారు. నేడు ఓట్ల లెక్కింపు జరగ్గా... బీజేపీ 3, విపక్షాలు 4 స్థానాల్లో విజయం సాధించాయి. INDIA కూటమిగా ఏర్పడ్డాక విపక్షాలకు లభించిన ఈ విజయాలకు ప్రాధాన్యత ఏర్పడింది.

 త్రిపురలోని ధన్ పూర్, బోక్సానగర్... ఉత్తరాఖండ్ లోని బాగేశ్వర్ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఉత్తర ప్రదేశ్ లోని ఘోసి, ఝార్ఖండ్ లోని డుమ్రి, కేరళలోని పుత్తుపల్లి, పశ్చిమ బెంగాల్ లోని ధుగ్ పురి నియోజకవర్గాల్లో విపక్షాల అభ్యర్థులు నెగ్గారు. 

ఘోసి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే దారా సింగ్ సమాజ్ వాదీ నుంచి మళ్లీ బీజేపీ గూటికి తరలి వెళ్లారు. అయితే, ఉప ఎన్నికల్లో ఆయనకు పరాజయం ఎదురైంది. సమాజ్ వాదీ పార్టీకి చెందిన సుధాకర్ సింగ్ 42,759 ఓట్ల తేడాతో గెలుపొందారు. 

కేరళలోని పుత్తుపల్లిలో దివంగత మాజీ సీఎం, కాంగ్రెస్ యోధుడు ఊమెన్ చాందీ కుమారుడు చాందీ ఊమెన్ 36 వేల ఓట్లతో ఘనవిజయం అందుకున్నారు. ఝార్ఖండ్ లోని డుమ్రి నియోజకవర్గంలో ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అభ్యర్థి బేబీ దేవి గెలిచారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ప్రాబల్యం ఉన్న ధుగ్ పురి నియోజకవర్గంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల్ చంద్ర రాయ్ గెలుపొందారు. 

ఇక, త్రిపురలోని బోక్సానగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి తఫజ్జల్ హుస్సేన్, గిరిజన ప్రాబల్య ధన్ పూర్ నియోజకవర్గం నుంచి బిందు దేబ్ నాథ్ విజయం సాధించారు. ఉత్తరాఖండ్ లోని బాగేశ్వర్ లో బీజేపీ అభ్యర్థి పార్వతి దాస్ 2,400 స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి బసంత్ కుమార్ పై నెగ్గారు.

More Telugu News