Rahul Gandhi: ఆ విషయంలో మోదీ ప్రభుత్వ వైఖరితో ఏకీభవిస్తున్నట్లు చెప్పిన రాహుల్ గాంధీ!

Opposition Agrees With Government Position On Ukraine says Rahul Gandhi
  • యూరప్ పర్యటనలో భాగంగా మీడియాతో కాంగ్రెస్ అగ్రనేత
  • రష్యా - ఉక్రెయిన్ వివాదంపై భారత ప్రభుత్వ వైఖరితో ప్రతిపక్షాలు ఏకీభవిస్తున్నాయన్న రాహుల్
  • జీ20 సదస్సుకు విపక్షనేతను పిలవలేదంటూ ఆగ్రహం
రష్యా-ఉక్రెయిన్ వివాదంపై బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ ప్రస్తుత వైఖరితో ప్రతిపక్షాలు ఏకీభవిస్తున్నట్లు ప్రకటించాయి. భారత్ చాలా పెద్ద దేశం కాబట్టి అనేక ద్వైపాక్షిక సంబంధాలు ఉండటం సహజమేనని, భారత ప్రభుత్వం వైఖరితో తాము ఏకీభవిస్తున్నట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం అన్నారు. యూరప్ పర్యటనలో భాగంగా బ్రసెల్స్ ప్రెస్ క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై మోదీ ప్రభుత్వం అనుసరిస్తోన్న అప్రమత్త వైఖరి, రష్యా నుండి చమురు కొనుగోలు తదితర అంశాలపై ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు.

దీనికి రాహుల్ స్పందిస్తూ... ఈ విషయంలో భారత్ ప్రదర్శించిన స్వతంత్ర వైఖరి సరైనదేనన్నారు. భారత్‌కు రష్యాతో మంచి సంబంధాలు ఉన్నాయని,  ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న దానికి భిన్నంగా ప్రతిపక్షాలు భిన్న అభిప్రాయం కలిగి ఉంటాయని తాను అనుకోవడం లేదన్నారు. భారత్‌కు రష్యాతో పాటు అమెరికాతోను మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. తమ దేశానికి ఎవరితోనైనా సంబంధాలు కలిగి ఉండే హక్కు ఉందన్నారు.

కశ్మీర్‌పై ప్రతిపక్షాల వైఖరిని, అలాగే ఆర్టికల్ 370ని మోదీ ప్రభత్వం రద్దు చేయడం గురించి అడిగిన ప్రశ్నకు, రాహుల్ స్పందిస్తూ... కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానాన్ని చూపించారు. అలాగే, కశ్మీర్ అభివృద్ధి, పురోగతిపై ప్రతిపక్షాలు కట్టుబడి ఉన్నాయన్నారు. ఆర్టికల్ 370పై తమకు స్పష్టత ఉందన్నారు. కశ్మీర్ అభివృద్ధి చెందాలని, పురోగమించాలని, అక్కడ శాంతి నెలకొనాలని మేము చాలా గట్టిగా భావిస్తున్నామన్నారు. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, అందుకే అంతర్జాతీయ మధ్యవర్తిత్వం అనే ప్రశ్న లేదన్నారు.

రాహుల్ ఇంకా మాట్లాడుతూ... జీ20 సదస్సుకు విపక్ష నేతను పిలవకపోవడం, 60 శాతం మందికి ప్రాతినిథ్యం వహిస్తోన్న వారికి విలువ ఇవ్వకపోవడమే అన్నారు. జీ20 సదస్సు జరగడం మంచి పరిణామమని, కానీ విపక్ష నేత ఖర్గేను పిలవకూడదని వారు నిర్ణయించుకున్నట్లుగా ఉందన్నారు. వారు ఎందుకలా భావిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. భారత్‌లో హింస, వివక్ష పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య సంస్థలపై పూర్తిస్థాయిలో దాడి జరుగుతోందని రాహుల్ అన్నారు.
Rahul Gandhi
Congress
Narendra Modi

More Telugu News