rishi sunak: భారత్ పర్యటన నాకు చాలా ప్రత్యేకం.. నన్ను ఆప్యాయంగానే అలా పిలుస్తారు: రిషి సునక్

  • తనను భారత దేశ అల్లుడిగా పిలుస్తారన్న రిషి సునక్
  • రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై విమర్శలు
  • పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు
rishi sunak feels special called indias son in law affectionately

జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు ఢిల్లీ చేరుకున్న బ్రిటన్ ప్రధాని రిషి సునక్ లండన్ నుండి బయలుదేరడానికి ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు వెళ్లడం తనకు చాలా ప్రత్యేకమని చెప్పారు. తనను భారతదేశ అల్లుడిగా వ్యవహరిస్తారని, ఆప్యాయతతో అలా పిలుస్తారన్నారు. భారత్ తన మనసుకు చాలా దగ్గరి దేశమన్నారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కూతురు అక్షితామూర్తిని రిషి సునక్ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయనతో పాటు అక్షిత కూడా భారత్ కు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం, అంతర్జాతీయ సంబంధాల నిర్మాణం వంటి స్పష్టమైన లక్ష్యాలతో తాను భారత పర్యటనకు వెళ్తున్నట్లు చెప్పారు. మరోవైపు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై విమర్శలు గుప్పించారు. పుతిన్ మరోసారి ముఖం చాటేశారన్నారు. ఆయన స్వయంగా తనకు తానే దౌత్య బహిష్కరణ రూపశిల్పిగా మలుచుకున్నారన్నారు. అధ్యక్ష భవనంలో ఉంటూ విమర్శలు పట్టించుకోకుండా, వాస్తవికతకు దూరంగా ఆయన ఉంటున్నారన్నారు. ఉక్రెయిన్ పై రష్యా ఆక్రమణను మానవ హక్కులు, ప్రజాస్వామ్యంపై దాడిగా ఆయన అభివర్ణించారు.

More Telugu News