Tamilisai Soundararajan: ప్రోటోకాల్ వివాదం, బిల్లుల పెండింగ్, తెలంగాణ సీఎంతో గ్యాప్ అంశాలపై గవర్నర్ తమిళిసై

  • పదవిలో నాలుగేళ్లు పూర్తి చేసుకొని, ఐదో ఏడాదిలోకి అడుగుపెట్టిన గవర్నర్
  • ప్రోటోకాల్ ఉల్లంఘనలతో ఎవరూ కట్టడి చేయలేరని వ్యాఖ్య
  • నాలుగేళ్ల కాలంలో ప్రజలకు సేవ చేసేందుకే ప్రయత్నించానన్న గవర్నర్
  • తెలంగాణతో బంధాన్ని మరిచిపోలేనని వ్యాఖ్య
  • కేసీఆర్‌తో ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టీకరణ
  • తెలుగులో ప్రసంగించిన గవర్నర్ తమిళిసై
Governor Tamilisai on protocal and gap with CM KCR

తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ నాలుగేళ్లు పూర్తి చేసుకొని, ఐదో ఏడాదిలో అడుగు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రోటోకాల్ వివాదం, బిల్లుల పెండింగ్ అంశం, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో గ్యాప్ తదితర అంశాలపై స్పందించారు. తనను ప్రోటోకాల్ ఉల్లంఘనలతో ఎవరూ కట్టడి చేయలేరన్నారు. తాను కోర్టు కేసులకు, విమర్శలకు ఏమాత్రం భయపడనని చెప్పారు.

ఈ నాలుగేళ్ల కాలంలో తాను తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికే ప్రయత్నించానన్నారు. తాను ఎక్కడున్నా తెలంగాణతో బంధాన్ని మాత్రం మరిచిపోలేనన్నారు. తనది ఎవరినీ మోసం చేసే మనస్తత్వం కాదన్నారు. ప్రతి అంశంలో గవర్నర్‌గా తనకు కొన్ని పరిమితులు ఉంటాయన్నారు. సవాళ్లకు, పంతాలకు తాను భయపడే వ్యక్తిని కాదన్నారు. తన బాధ్యతలను తాను సమర్థవంతంగా నిర్వహించడమే తనకు తెలుసునని చెప్పారు. 

సీఎం కేసీఆర్‌తో గ్యాప్ అంశంపై కూడా గవర్నర్ మాట్లాడారు. రాజ్ భవన్‌కు, ప్రగతి భవన్‌కు ఎలాంటి గ్యాప్ లేదన్నారు. ముఖ్యమంత్రితో తనకు దూరం లేదన్నారు. అయితే తాను మాత్రం తన మార్గంలోనే నడుస్తానన్నారు. ప్రభుత్వం పంపించిన వివిధ బిల్లుల విషయంలో అభిప్రాయ భేదాలు మాత్రమే వున్నాయని, విభేదాలు కానీ ఫైటింగ్ కానీ లేవన్నారు. తాను ఎలాంటి రాజకీయాలు చేయడం లేదన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ ప్రాతిపదిక ఉంటుందని, దానికి అనుగుణంగా నడుచుకున్నట్లు చెప్పారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ మంచిదేనని గవర్నర్ అభిప్రాయపడ్డారు.

కాగా, గవర్నర్ తెలుగులో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. 'ఐదో ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మీరు అందించిన ప్రేమకు ధన్యవాదాలు. గవర్నర్‌గా నా పదవీ కాలంలో ఈ రోజు ముఖ్యమైన మైలురాయి. ఈ గౌరవనీయ పదవిలో ఈ రోజు ఐదో సంవత్సరం మొదలు పెట్టబోతున్నాను. నేను తెలంగాణ గవర్నర్‌గా పదవి స్వీకరించినప్పుడు నా బాధ్యతను గుర్తుంచుకున్నాను. తొలి మహిళా గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించడం, మీ అందరితో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను' అంటూ తెలుగులో మాట్లాడారు.

More Telugu News