World Bank: భారత్ డిజిటల్ విజయాలను కొనియాడిన ప్రపంచబ్యాంక్

World Bank lauds India digital infra impact Five decade journey in 6 years
  • డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కు ప్రశంసలు
  • కేవలం ఆరేళ్లలోనే ఐదు దశాబ్దాల పురోగతి అంటూ ప్రస్తావన
  • యూపీఐ విజయాలకూ అభినందనలు
భారత్ డిజిటల్ ప్రయాణాన్ని ప్రపంచబ్యాంక్ నోరారా కొనియాడింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో గడిచిన పదేళ్లలో డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పరంగా భారత్ సాధించిన పురోగతిని ప్రశంసించింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. 

ఆర్థిక సేవలను అందరికీ చేరువ చేయడంలో భారత్ సాధించిన ఫలితాలను ప్రపంచబ్యాంక్ ప్రస్తావించింది. సామాన్యులకు సున్నా బ్యాలన్స్ తో కూడిన ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (బ్యాంక్ ఖాతాల పథకం), ఆధార్ అనేవి ఆర్థిక సేవల విస్తృతికి తోడ్పడినట్టు తెలిపింది. కేవలం ఆరేళ్లలో 2018 నాటికి ఉన్న 25 శాతం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ (ఆర్థిక సమ్మిళిత రేటు)ను 80 శాతానికి చేర్చినట్టు కీర్తించింది. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడంలో 47 ఏళ్లు ముందుకు తీసుకెళ్లినట్టు పేర్కొంది. 

భారత్ లో డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వ సేవలనే కాకుండా, ప్రైవేటులోనూ సామర్థ్యాలు పెరిగేందుకు ఇది దారితీసినట్టు ప్రపంచబ్యాంక్ వివరించింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు పెద్ద ఎత్తున వ్యయాలు తగ్గినట్టు తెలిపింది. భారత్ సాధించిన అద్భుతమైన యూపీఐ విజయాన్ని కూడా ప్రపంచబ్యాంక్ ప్రస్తావించింది. ఒక్క 2023 మే నెలలోనే రూ.14.89 లక్షల కోట్ల విలువ చేసే 941 కోట్ల యూపీఐ లావాదేవీలు నమోదైనట్టు వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో నమోదైన మొత్తం యూపీఐ లావాదేవీల విలువ భారత్ జీడీపీలో 50 శాతంగా ఉంటుందని తెలిపింది.
World Bank
lauds
India
digital infra
UPI success

More Telugu News