Manmohan Singh: మోదీ నిర్ణయాన్ని మెచ్చుకున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

  • ఉక్రెయిన్ - రష్యా యుద్ధం విషయంలో మన స్టాండ్ కరెక్టేనని వ్యాఖ్య
  • మిగతా ప్రపంచంతో పాటు భారత్ కూడా శాంతిని కోరుకుంటోందని వెల్లడి
  • జీ20 సదస్సుకు ఇండియా నాయకత్వం వహించడం సంతోషంగా ఉందన్న మాజీ ప్రధాని
Manmohan Singh Backs Centres Russia Ukraine Stance

జీ 20 సదస్సుకు భారతదేశం నాయకత్వం వహించడం తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందని మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ అన్నారు. తన జీవితకాలంలోనే ఈ గొప్ప అవకాశం రావడం, సమావేశాలను చూడడం ఆనందంగా ఉందన్నారు. భారత దేశానికి విదేశాంగ విధానం అనేది చాలా ముఖ్యమని, ప్రస్తుత కాలంలో దీని ప్రాముఖ్యత మరింత పెరిగిందని చెప్పారు. దేశ రాజకీయాల్లో కూడా విదేశీ వ్యవహారాలు కీలకంగా మారాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉక్రెయిన్ - రష్యా యుద్ధం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మన్మోహన్ సింగ్ మెచ్చుకున్నారు. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నపుడు ఎవరో ఒకరివైపు నిలబడేలా ప్రపంచ దేశాలపైన ఒత్తిడి పెరుగుతుందని అన్నారు. అయితే, భారత దేశం ఈ ఒత్తిడికి తలొగ్గకుండా తటస్థంగా ఉండడం, దేశ సార్వభౌమత్వాన్ని, ఆర్థిక ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించడం గొప్ప నిర్ణయమని కొనియాడారు. ఈ విషయంలో ప్రధాని మోదీ సర్కారు సరైన నిర్ణయం తీసుకుందని చెప్పారు.

ఢిల్లీలో జరుగుతున్న జీ20 సమావేశాలకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గైర్హాజరు కావడంపైనా మన్మోహన్ సింగ్ స్పందించారు. జిన్ పింగ్ రాకపోవడం దురదృష్టకరమని అన్నారు. లడఖ్ సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ఉద్రిక్తతల విషయంలో ప్రధాని మోదీ జాగ్రత్తగా వ్యవహరిస్తారని, దేశ భూభాగాన్ని కాపాడుకునే అవసరమైన చర్యలు తీసుకుంటారని తాను నమ్ముతున్నట్లు మన్మోహన్ సింగ్ చెప్పారు. డిప్లొమాటిక్ వ్యవహారాల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తాను సలహాలు ఇవ్వడానికి ఇది సరైన సమయం కాదని చెప్పారు. వరుస విజయాలను సాధిస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ను మాజీ ప్రధాని ప్రశంసించారు. భారత దేశ భవిష్యత్తు ఆశాజనకంగానే ఉందని మన్మోహన్ సింగ్ వివరించారు.

More Telugu News