Rains In Telangana: బలహీనపడిన అల్పపీడనం.. తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు

  • నిన్న కూడా పలు జిల్లాలలో భారీ వర్షాలు
  • తెలంగాణలో ఈ సీజన్‌లో సాధారణానికి మించిన వర్షపాతం
  • ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ
Light to moderate rains expected in Telangana for next 4 days

తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని, దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో నాలుగు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నేటి నుంచి రేపు ఉదయం వరకు ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, శుక్ర, శనివారాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. 

నిన్న కూడా పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ సహా మరికొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. నిజామాబాద్ జిల్లాలో నిన్న అత్యధికంగా 42.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో వర్షపాతం ఆశాజనకంగానే ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఈ సీజన్‌లో రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 72.10 సెంటీమీటర్లు కాగా, నిన్నటికే  74.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించింది.

More Telugu News